india: భారత్‌తో సహా పలు దేశాల్లో మొరాయించిన వాట్సాప్!
- ఫిర్యాదు చేస్తున్న వినియోగదారులు
- కాసేపు ఆగిపోయిన సేవలు
- కారణాలు తెలియరాలేదు
ప్రపంచ ప్రాచుర్య మెసేజింగ్ సర్వీస్ యాప్ వాట్సాప్, భారత్ సహా పలు దేశాల్లో మొరాయించింది. ఇవాళ మధ్యాహ్నం 12గం.ల నుంచి తమ వాట్సాప్ పనిచేయడం లేదని దేశంలో చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. అలాగే ఇటలీ, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్, జర్మనీ, అమెరికా, శ్రీలంక దేశాల్లో కూడా వాట్సాప్ మొరాయించినట్లు తెలుస్తోంది.
వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపడం గానీ, రిసీవ్ చేసుకోవడం గానీ కుదరడం లేదని వినియోగదారులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా స్టేటస్ అప్‌డేట్ కూడా పనిచేయడం లేదని చెబుతున్నారు.
దీంతో అయోమయానికి గురై స్మార్ట్‌ఫోన్లో సమస్యమో అనుకుని వాట్సాప్‌ను రీఇన్‌స్టాల్ చేయడం, మెమొరీ క్లియర్ చేయడం వంటి పనులు చేసినట్లు వెల్లడించారు. గతంలో కూడా వాట్సాప్ ఇలా మొరాయించిందని, కొన్ని గంటల తర్వాత సమస్య తీరిపోతుందని డౌన్‌డిటెక్టర్ అనే సంస్థ వెల్లడించింది. అయితే ఈ సమస్యకు కారణం ఏంటో తెలియరాలేదు. ఎక్కువ మంది వినియోగదారులు ఉండటం వల్ల అప్పుడప్పుడు ఇలా సర్వర్ సమస్యలు రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.