sanjay leela bhansali: సంజయ్‌లీలా భన్సాలీ తర్వాతి చిత్రంలోనూ దీపికా పదుకునే!
- నిజజీవిత ప్రేమకథను తెరకెక్కించనున్న భన్సాలీ
- కవయిత్రి అమృత ప్రీతమ్ పాత్ర పోషించనున్న దీపికా
- కవి సాహిర్ లూధియాన్వీ పాత్రలో అభిషేక్ బచ్చన్
'పద్మావతి' చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తన తదుపరి చిత్రంలోనూ దీపికా పదుకునేను కథానాయికగా ఎంచుకున్నారు. నిజజీవిత ప్రేమకథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కవయిత్రి అమృతా ప్రీతమ్‌గా దీపికా కనిపించనుంది. అలాగే నటుడిగా కవి సాహిర్ లూధియాన్వీ పాత్రలో అభిషేక్ బచ్చన్ కనిపించనున్నారు. సినీ గేయరచయితగా, కవిగా రాణించిన సాహిర్ లూధియాన్వీ పాత్ర కోసం అభిషేక్ ఇప్పటికే హోంవర్క్ చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
1944లోనే ప్రీతమ్ సింగ్‌ను పెళ్లి చేసుకున్న అమృత, తర్వాత అనుకోకుండా కలిసిన సాహిర్‌తో ప్రేమలో పడింది. ఉత్తరాల ద్వారా కొంతకాలం వీరి ప్రేమకథ కొనసాగింది. అయితే ఒకరితో ఒకరు తమ ప్రేమ గురించి చెప్పుకోలేదు. తర్వాత 'రసిదీ టికెట్' పుస్తకంలో తాము రాసుకున్న ఉత్తరాల గురించి, సాహిర్ మీద తనకున్న ప్రేమ గురించి అమృతా ప్రీతమ్ ప్రస్తావించింది. సాహిర్ కూడా అతని తల్లితో అమృతాతో ప్రేమ విషయం గురించి మాట్లాడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
1960లో ప్రీతమ్‌తో బంధాన్ని అమృత తెంచుకుంది. అలాగే సాహిర్ కూడా గాయని సుధా మల్హోత్రా ప్రేమలో పడటంతో అతనితో సంబంధానికి కూడా అమృత చెక్ పెట్టింది. తర్వాత చిత్రకారుడు ఇమ్రోజ్‌తో బంధాన్ని ఏర్పరుచుకుంది. ఈ సంఘటన ఆధారంగానే 1964లో వచ్చిన 'దూజ్ కా చాంద్' చిత్రంలో 'మెహఫిల్ సే ఉఠ్ జానేవాలో' పాటను సాహిర్ రాసినట్లు చెబుతారు.