team india: ధోనీ జట్టును వీడిన మరుక్షణం టీమిండియాలో శూన్యత తథ్యం: ఆసీస్ దిగ్గజ బ్యాట్స్ మన్
- టీమిండియాకు ధోనీ పెద్ద బలం
- కీలక సమయాల్లో వేగంగా నిర్ణయం తీసుకోగలడు
- ధోనీ అనుభవం కోహ్లీకి ఎంతో ఉపయోగపడుతుంది
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్ జట్టును వీడిన మరుక్షణం టీమిండియాలో శూన్యత ఏర్పడడం ఖాయమని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ జోస్యం చెప్పాడు. ఈ మధ్యకాలంలో తాను క్రికెట్ ను పెద్దగా ఫాలో కావడం లేదన్న గిల్ క్రిస్ట్, ఇప్పుడు ధోనీ ఆటతీరు ఎలా ఉందో తనకు తెలియదని అన్నాడు. అయితే ధోనీలో అద్భుతమైన ప్రతిభ ఉందని, మూడో నెంబర్ నుంచి ఏడో నెంబర్ వరకు ఏ ఆర్డర్ లో అయినా ధోనీ అద్భుతంగా బ్యాటింగ్ చెయ్యగలడని అన్నాడు.
ధోనీ బ్యాటింగ్ లో ఇప్పుడు ఫెయిల్ అయినా, అతనికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తాడని అన్నాడు. ధోనీకి ఉన్న అనుభవం టీమిండియాకు చాలా మేలుచేస్తోందని చెప్పాడు. కీలక సమయాల్లో ధోనీ వేగంగా నిర్ణయం తీసుకోగలడని అన్నాడు. ప్రస్తుత విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టుకు ధోని అవసరం చాలా ఉందని గిల్లీ చెప్పాడు. జట్టు నుంచి ధోని వెళ్లిపోతే అతని స్థానాన్ని ఎవ్వరూ పూడ్చలేరని స్పష్టం చేశాడు.