america: అమెరికా పాస్ పోర్టు విధానంలో కొత్త నిబంధనలు.. లైంగిక దాడులకు పాల్పడితే పాస్ పోర్ట్ రద్దు !
- లైంగిక దాడులకు పాల్పడిన వారి పాస్ పోర్టులు రద్దు
- కొత్త పాస్ పార్ట్ లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి
- విచారణ ఎదుర్కొన్నాడు అంటూ పాస్ పోర్టులో ముద్రిస్తారు
తమ పాస్ పోర్ట్ విధానంలో కొత్త నిబంధనలను విధిస్తున్నట్టు అమెరికా తెలిపింది. పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడిన వారి పాస్ పోర్ట్ లను రద్దు చేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. వీరంతా, పాస్ పోర్ట్ ల కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, కొత్త విధానం ప్రకారం 'పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడిన ఈ పాస్ పోర్ట్ దారుడు అమెరికా చట్టాల ప్రకారం విచారణ ఎదుర్కొన్నాడు' అంటూ పాస్ పోర్ట్ వెనుకవైపు ఉన్న కవర్ లోపల ముద్రిస్తారు. మొదటిసారి పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకునేవారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.
అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఉదారవాదులు మండిపడుతున్నారు. కేవలం ఒక వర్గం వారిని లక్ష్యం చేసుకునే ఈ నిబంధనను తీసుకొస్తున్నారని వారు మండిపడుతున్నారు. 1994లో జరిగిన ఓ ఘటనే ఈ నిబంధనను తీసుకురావడానికి కారణం. మేగన్ కంకా అనే ఏడేళ్ల బాలికను ఓ వ్యక్తి రేప్ చేసి చంపేశాడు. అనంతరం బాలబాలికల రక్షణ కోసం అమెరికా 'అంతర్జాతీయ మేగన్ చట్టం'ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారమే పాస్ పోర్ట్ విధానంలో మార్పులు చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.