America: న్యూయార్క్ ఉగ్రదాడి నిందితుడి వింత కోరిక.. తన గదిలో ఐసిస్ జెండా పెట్టాలని గొడవ!
- దాడిపై ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయని ఉగ్రవాది
- వీలైనంతమందిని హతమార్చే ఉద్దేశంతోనే హోలోవీన్ డే ఎంపిక
- ఐసిస్‌తో సైపోవ్‌కు నేరుగా సంబంధాలు లేవన్న పోలీసులు
బుధవారం న్యూయార్క్‌లో ట్రక్కు దాడికి పాల్పడి 8 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాది సైఫుల్లా సైపోవ్ వింత కోరిక కోరాడు. పోలీసుల కాల్పుల్లో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైపోవ్ కరుడుగట్టిన ఐసిస్ సానుభూతిపరుడు. తన గదిలో ఇస్లామిక్ స్టేట్ జెండా పెట్టాలంటూ తనకు చికిత్స అందిస్తున్న వైద్యులతో గొడవ పడ్డాడు.
ఉగ్రదాడి విషయంలో ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయని సైపోవ్ ‘‘నేను చేసిన పని మంచిదే’’ అని పేర్కొన్నాడు. వీలైనంత మందిని చంపడమే లక్ష్యంగా హోలోవీన్ డేను ఎంచుకున్నట్టు చెప్పాడు. ఆ రోజు అయితే వీధుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకే ఆ రోజును ఎంచుకున్నట్టు విచారణలో తెలిపాడు.
అతడిపై పలు నేరాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఉజ్బెకిస్థాన్‌కే చెందిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇస్లామిక్ స్టేట్‌కు సహకరించేందుకే సైఫుల్లా ఈ ఉగ్రదాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఐసిస్‌తో అతడికి నేరుగా సంబంధాలు లేవని పేర్కొన్నారు.