Chandrababu: తెలంగాణలో టీడీపీ జెండా మళ్లీ ఎగరాలి.. అందరికీ న్యాయం జరగాలి: చంద్రబాబు పిలుపు
- తెలంగాణలో 15 సీట్లు గెలిచాం.. బీజేపీ 5 సీట్లు గెలిచింది
- ఆ తరువాత జరిగిన దారుణాన్ని చెప్పదల్చుకోవడం లేదు
- యుద్ధం చేయాల్సిన అవసరం లేదు
- ప్రజా సేవ చేయండి.. ప్రజలే ఆదరిస్తారు
తెలంగాణలో తమ పార్టీ 15 సీట్లు గెలిచిందని, తమ మిత్రపక్షం బీజేపీ 5 సీట్లు గెలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ తరువాత జరిగిన దారుణాన్ని చెప్పదల్చుకోవడం లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగు వారి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వారి సంక్షేమమే కోరుతుందని తెలుగు దేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు.
తమ నాయకులపై, కార్యకర్తలపై నమ్మకం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీకి వ్యక్తిగతంగా ఎవరిపైనా విద్వేషం లేదని చెప్పారు. పార్టీ అజెండా సమస్యలపై పోరాడడమేనని చెప్పారు. తాము బడుగు, బలహీన వర్గాలు, షెడ్యూలు కులాలు, తెగలవారికి అండగా ఉన్నామని చెప్పారు. వారికి రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చింది టీడీపీ పార్టీయేనని చెప్పారు. సమాజంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి తెలుగు దేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
హైదరాబాద్‌లో మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, 10 ఏళ్లు ప్రతిపక్ష పార్టీగా కూడా ఉన్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. సైబరాబాద్ నిర్మాణం చేసింది టీడీపీనేనని, అమరావతిని కూడా నిర్మించాలని దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడని అన్నారు. తెలంగాణలో టీడీపీ జెండా మళ్లీ ఎగరాలని, అందరికీ న్యాయం జరగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. యుద్ధం చేయాల్సిన అవసరం లేదని, ప్రజా సేవ చేయండని, ప్రజలే ఆదరిస్తారని అన్నారు. టీడీపీని మరింత ముందుకు తీసుకుపోయే కార్యక్రమానికి ప్రణాళిక వేయాలని టీటీడీపీ నేతలకు సూచించారు. నెలనెలా సమీక్షలు కూడా జరపాలని చెప్పారు.