Narendra Modi: కాంగ్రెస్ పార్టీ ఓ లాఫింగ్ క్లబ్: ప్రధాని నరేంద్ర మోదీ
- హిమాచల్‌ప్రదేశ్‌లో జోరుగా ఎన్నికల ప్రచారం
- హిమాచల్ ప్రదేశ్ సీఎం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు
- మరోవైపు కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకమని చెప్పుకుంటోంది
- కాంగ్రెస్‌ను చిన్న పిల్లలు కూడా నమ్మరు
హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో పలు పార్టీల నేతలు జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ లాఫింగ్ క్లబ్ అని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, మరోవైపు ఆ పార్టీ మేనిఫెస్టోలో అవినీతికి వ్యతిరేకమని చెప్పుకుంటోందని చురకలంటించారు.
కాంగ్రెస్‌ను చిన్న పిల్లలు కూడా నమ్మబోరని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ రాష్ట్రంలో మైనింగ్, మాదకద్రవ్యాలు, మాఫియా అరాచకాలు వంటి చర్యలు మితిమీరి పోయాయని చెప్పారు. అటువంటి వాటికి చరమగీతం పాడాల్సి ఉందని చెప్పారు. డోక్లామ్ వివాదాన్ని ఎంతో సామరస్యంగా పరిష్కరించినప్పటికీ కాంగ్రెస్ మాత్రం దానిని ప్రశ్నిస్తూనే ఉందని తెలిపారు. మన సైన్యంపై నమ్మకం ఉంచకుండా రాహుల్ గాంధీ చైనా రాయబారిని కలుసుకొని డోక్లామ్ వివాదం గురించి తెలుసుకున్నారని విమర్శించారు.