rasool pookutty: నటుడిగా తెరంగేట్రం చేయనున్న భారతీయ ఆస్కార్ విజేత
- 'ఒరు కథై సొల్లట్టుమా' చిత్రంలో నటించనున్న రసూల్ పూకుట్టి
- సౌండ్ ఇంజినీర్ పాత్రను పోషించనున్న సౌండ్ ఇంజినీర్
- తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల
'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రానికి ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న సౌండ్ ఇంజినీర్ రసూల్ పూకుట్టి, త్వరలో నటుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'ఒరు కథై సొల్లట్టుమా' చిత్రం ద్వారా ఆయన తెరంగేట్రం చేయబోతున్నాడు. విచిత్రంగా ఈ చిత్రంలో ఆయనకు సౌండ్ ఇంజినీర్ పాత్ర పోషించే అవకాశం దక్కింది. త్రిస్సూర్‌లో జరిగే ప్రముఖ పూరం పండగలో వినిపించే శబ్దాలను రికార్డు చేసే లక్ష్యంతో పనిచేసే సౌండ్ ఇంజినీర్ పాత్రలో రసూల్ నటించనున్నాడు.
ప్రసాద్ ప్రభాకరన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు జరిగే త్రిస్సూర్ పూరం పండగకు కొన్ని లక్షల మంది హాజరవుతారు. అక్కడ వినిపించే సంప్రదాయ సంగీతాన్ని రికార్డు చేయాలనేది రసూల్ పూకుట్టి నిజజీవిత లక్ష్యం కూడా. ఈ సినిమా కోసం హాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన 80 మంది సౌండ్ టెక్నీషియన్లు కష్టపడి త్రిస్సూర్ పూరం పండగ శబ్దాలను రికార్డు చేయనున్నారని దర్శకుడు ప్రభాకరన్ తెలిపారు.