application: యాప్ ద్వారా టాలెంట్ సెర్చ్ ప‌రీక్ష... అమలు చేయ‌నున్న కేంద్రం

  • న‌వంబ‌ర్ 26న జ‌ర‌గ‌నున్న నేష‌న‌ల్ టాలెంట్ సెర్చ్ ప‌రీక్ష‌
  • న‌మోదు చేసుకున్న 91వేల మంది విద్యార్థులు
  • దేశ‌వ్యాప్తంగా 2078 సెంట‌ర్ల‌లో ప‌రీక్ష‌
  • ప్రపంచంలోనే మొదటిసారి

విద్యార్థుల్లో సాంకేతిక‌త వాడకాన్ని పెంపొందించేందుకు నేష‌న‌ల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేష‌న్ (ఎన్‌టీఎస్ఈ)ను మొబైల్ అప్లికేష‌న్ ద్వారా నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర స‌మాచార సాంకేతిక స‌హాయ‌ మంత్రి ఆల్ఫోన్స్ క‌న్న‌న్‌థామ‌న్ తెలిపారు. '91వేల మంది న‌మోదు చేసుకున్న ఈ ప‌రీక్ష (ఎన్‌టీఎస్ఈ)ను దేశ‌వ్యాప్తంగా 2078 ప‌రీక్షా కేంద్రాల్లో నిర్వ‌హించ‌నున్నాం. ఇంత మంది విద్యార్థుల‌కు యాప్ ద్వారా పరీక్ష నిర్వ‌హించనుండ‌టం ప్ర‌పంచంలో ఇదే మొద‌టిసారి' అని ఆయ‌న అన్నారు. ప‌రీక్ష కోసం ఉప‌యోగించ‌నున్న విద్యార్థి విజ్ఞాన్ మంథ‌న్ (వీవీఎం) యాప్‌ను ఆల్ఫోన్స్ ఆవిష్క‌రించారు. ఈ ప‌రీక్ష న‌వంబ‌ర్ 26న జ‌ర‌గ‌నుంది.

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ స్టోర్ల నుంచి వీవీఎం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ యాప్‌లో రిజిస్ట‌ర్ చేసుకున్న త‌ర్వాత వారికి కేటాయించిన ప‌రీక్షా కేంద్రానికి వెళ్లి విద్యార్థులు ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. ప‌రీక్ష మొద‌ల‌వ‌గానే స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ల‌లోని ఇత‌ర యాప్‌లు ప‌నిచేయ‌కుండా వీవీఎం యాప్ నియంత్రిస్తుంది. దీంతో ప‌రీక్ష‌లో కాపీ కొట్టే అవ‌కాశం ఉండ‌దు. ఈ ప‌రీక్ష‌లో ఉత్త‌మ ర్యాంకు సాధించిన విద్యార్థుల‌ను ప్ర‌భుత్వం త‌ర‌ఫున దేశ‌, విదేశాల్లోని విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న కేంద్రాల‌కు తీసుకువెళ్తామ‌ని శాస్త్ర‌వేత్త అర‌వింద్ ర‌న‌డే తెలిపారు. అంతేకాకుండా న‌గ‌దు బ‌హుమ‌తులు కూడా అంద‌జేస్తామ‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News