geneva airport: నిజంగా గడుగ్గాయే... టికెట్ లేకుండా విమానం ఎక్కేసిన ఏడేళ్ల చిన్నారి... ఎలాగో తెలిస్తే అవాక్కే!
- నిజ జీవితంలో 'హోం ఎలోన్' స్టోరీ
- అమ్మానాన్నలను వదిలి విమానాశ్రయం బస్ ఎక్కిన పాప
- ఎయిర్ పోర్టులోనూ గుర్తించని సిబ్బంది
- విమానం ఎక్కిన తరువాత ఓ అధికారికి అనుమానం
- సెక్యూరిటీ వైఫల్యంపై విమర్శలు
మీకు హోం ఎలోన్, బేబీస్ డే అవుట్ వంటి చిత్రాలు గుర్తున్నాయా? చిన్న చిన్న గడుగ్గాయిలు, ఇల్లు వదిలి తప్పించుకుని అమ్మా నాన్నలను నానా ఇబ్బందులూ పెడుతుంటారు. ఆ సినిమాలు ప్రేక్షకులను అలరించి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కూడా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది నిజజీవితంలో జరిగిన అటువంటి ఘటన.
ఏడేళ్ల బాలిక ఎలాంటి టికెట్ లేకుండా విమానాశ్రయంలోకి ప్రవేశించి ఓ విమానం ఎక్కేసింది. జెనీవాలో జరిగిన ఈ ఘటన పోలీసులను సైతం అవాక్కయ్యేలా చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే... ఆదివారం నాడు జెనీవా కేంద్ర రైల్వే స్టేషన్ దగ్గర పొరపాటున తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి విమానాశ్రయానికి వెళుతున్న బస్సును ఎక్కేసింది. ఈలోగా తమ పాప కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, వారు రంగంలోకి దిగి సీసీటీవీలను పరిశీలించారు.
ఆ పాప ఎక్కిన వాహనం ఎయిర్ పోర్టుకు వెళ్లిందని తెలుసుకుని అక్కడికి సమాచారం ఇచ్చారు. ఈలోగానే విమానాశ్రయం మెయిన్ సెక్యూరిటీ గేటును దాటుకుని లోనికి వెళ్లిన పాప, తన చుట్టూ ఉన్న పెద్దవాళ్ల మధ్య నడుచుకుంటూ సెక్యూరిటీ చెక్ ను కూడా దాటేసి, ముందుకెళ్లి డిపార్చర్ కు సిద్ధంగా ఉన్న ఓ విమానాన్ని ఎక్కేసింది. విమానం ఎక్కుతున్నప్పుడు కూడా అక్కడున్న సిబ్బంది ఆ పాప ఎవరో ప్రయాణికులకు సంబంధించిన పాపేనని అనుకున్నారు. అంతకుముందు ఓ విమానం బోర్డింగ్ గేటు వద్దకు వచ్చి అటూ ఇటూ చూసి, తన తల్లిదండ్రులను ఆమె వెతుక్కున్నట్టు సీసీటీవీల్లో కనిపించింది. రెండోసారి మాత్రం ఓ విమానాన్ని పాప ఎక్కేయగా, ఓ అధికారికి అనుమానం వచ్చి, ఆరా తీసి ఆమెను పోలీసులకు అప్పగించాడు.
ఇక ఆ పాప ఏ విమానం ఎక్కిందన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. ఫ్రాన్స్, స్విస్ సరిహద్దుల్లో ఉన్న జెనీవా ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణికులు రెండు దేశాల మధ్యా అత్యధిక సంఖ్యలో తిరుగుతూ ఉంటారు. ఇక ఈ ఘటన దురదృష్టకరమని, మరోసారి జరుగకుండా చూసుకుంటామని ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు. ఇక ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.