nasa: నాసా 2020లో ప్రయోగించే మార్స్ రోవర్‌కి 23 కెమెరాలు ఉంటాయట!
- గ్రహ వాతావరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు యత్నం
- క్యూరియాసిటీ కంటే మెరుగైన 3డీ ఇమేజింగ్ కెమెరాలు
- వెల్లడించిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ
2020లో అంగారక గ్రహం మీదకి పంపించనున్న రోవర్‌లో 23 కెమెరాలు అమర్చనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. ఈ కెమెరాల సాయంతో అత్యంత స్పష్టమైన పానొరామిక్ చిత్రాలు, రోవర్ దారిలో ఎదురయ్యే అడ్డంకుల చిత్రాలతో పాటు అంగారక గ్రహ వాతావరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసే అవకాశం కలగనుందని నాసా చెబుతోంది. గ్రహం మీద రోవర్ అడుగు పెట్టిన మరుక్షణం నుంచి ఈ 23 కెమెరాలు పనిచేయడం ప్రారంభిస్తాయని తెలిపింది. రోవర్ అంతర్భాగంలో కూడా ఒక కెమెరా ఉంటుందని, అక్కడ రోవర్ సేకరించిన శాంపిళ్లను పరిశోధించడానికి ఈ కెమెరా సహాయ పడుతుందని చెప్పింది.
క్యూరియాసిటీ రోవర్ కంటే మెరుగైన 3డీ ఇమేజింగ్ కెమెరాలను ఇందులో నిక్షిప్తం చేస్తున్నట్లు మాస్టర్‌క్యామ్ జీ ప్రధాన విశ్లేషకుడు జిమ్ బెల్ తెలిపాడు. రోవర్ ప్రధాన భాగాల్లో ఈ మాస్టర్‌క్యామ్ జీ కెమెరాలను ఉపయోగించనున్నారు. ఈ స్టీరియోస్కోపిక్ కెమెరాల ద్వారా 3డీ చిత్రాలు తీయడంతో పాటు సుదూర ప్రాంతాల్లో ఉన్న శాంపిళ్లను కూడా గుర్తించే అవకాశముందని జిమ్ పేర్కొన్నాడు. అంతేకాకుండా గ్రహం మీద ఉన్న జియోలాజికల్ పరిస్థితులను కూడా భూమ్మీద నుంచే అధ్యయనం చేయవచ్చని చెప్పారు.