Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. రెండేళ్లు తక్కువ కావడంతో చాన్స్ కొట్టేసిన వృద్ధ నేత!
- ప్రేమ్ కుమార్ ధుమాల్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన అమిత్ షా
- గతంలో రెండు పర్యాయాలు సీఎంగా పనిచేసిన ధుమాల్
- ఠాకూర్లు ఎక్కువగా నివసించే సుజనాపూర్ నుంచి బరిలోకి
త్వరలో ఎన్నికలు జరగనున్న హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్ ను తమ సీఎం అభ్యర్థిగా పేర్కొంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. ధుమాల్ గతంలో రెండుసార్లు హిమాచల్‌ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1998-2003, 2008-2012 వరకు రెండు పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ అనధికారికంగా ప్రకటించిన ఏజ్ బార్‌కు ధుమాల్ రెండేళ్ల దూరంలో ఉండడం గమనార్హం. ప్రస్తుతం ధుమాల్ వయసు 73 ఏళ్లు.
ఈనెల 9న హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ప్రొఫెసర్ ధుమాల్ ఈసారి కొత్త నియోజకవర్గం సుజనాపూర్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ నియోజకవర్గంలోని కంగ్రా, హమీర్పూర్, మండి ప్రాంతాల్లో ఠాకూర్ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో ఆయనను అక్కడి నుంచి బరిలోకి దింపాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఇక్కడి మొత్తం జనాభాలో 35 శాతం మంది ఠాకూర్లే. కాగా, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేంద్రమంత్రి జేపీ నడ్డా, ధుమాల్ పేర్లను పరిశీలించినా చివరికి ధుమాల్ వైపే బీజేపీ మొగ్గు చూపింది.