America: న్యూయార్క్ లో మరో ఉగ్రదాడి.. ట్రక్కుతో బీభత్సం సృష్టించిన దుండగుడు.. ఎనిమిది మంది మృతి!
- ఉగ్రదాడిలో 8 మంది మృతి.. 11 మందికి తీవ్ర గాయాలు
- దాడి తర్వాత ‘అల్లాహు అక్బర్’ అని అరుస్తూ పరుగులు పెట్టిన ఉగ్రవాది
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
అమెరికాలో మరో ఉగ్రదాడి జరిగింది. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) వద్ద దుండగుడు ఒకడు ట్రక్కుతో బీభత్సం సృష్టించాడు. సెప్టెంబరు 11, 2001 తర్వాత న్యూయార్క్‌లో జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. లోయర్ మాన్‌హట్టన్ ప్రాంతంలో ట్రక్కును నడుపుకుంటూ వచ్చిన దుండగుడు ఒక్కసారిగా దానిని సైకిళ్లు ప్రయాణించే మార్గంలోకి మళ్లించి జనాల పైనుంచి పోనిచ్చాడు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్‌ను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నాడు.
నిందితుడిని సైపోవ్ (29)గా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం స్కూలు బస్సును ఢీకొట్టిన సైపోవ్ ట్రక్కు దిగి ‘అల్లాహు అక్బర్’ అని అరుస్తూ హైవే వెంబడి పరుగులు తీశాడు. ఆ సమయంలో అతడి చేతిలో పెల్లెట్ గన్ ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సైపోవ్ 2010లో అమెరికాకు వలస వచ్చినట్టు పోలీసులు తెలిపారు. దాడికి ఉపయోగించిన ట్రక్కు వద్ద అరబిక్‌లో రాసిన లేఖను గుర్తించారు. దీనిని బట్టి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌తో అతడికి సంబంధాలున్నట్టు తెలుస్తోందని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. ఇది ఉగ్రదాడేనని మేయర్ బిల్ డే బ్లాసియో ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ట్రక్కు దాడిపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.