Bhanvarlal: రిటైరైన గంటల్లోనే చిక్కుల్లో మాజీ ఎన్నికల అధికారి.. భన్వర్‌లాల్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ సర్కారు ఆదేశం
- ప్రభుత్వ భవనం దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న భన్వర్‌లాల్
- ప్రభుత్వం విధించిన జరిమానా కట్టకపోవడంతో చర్యలకు ఆదేశం
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సీఎస్
ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ రిటైరైన కాసేపటికే ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ దినేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నవంబరు 1996లో భన్వర్‌లాల్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
ఆ సమయంలో ఆయనకు బంజారాహిల్స్ రోడ్ నంబరు 13లో అధికారిక కలెక్టర్ నివాసంగా క్వార్టర్ నెంబరు 33ని కేటాయించారు. జూలై 2000లో భన్వర్‌లాల్ స్థానంలో అరవింద్ కుమార్‌ను ప్రభుత్వం కలెక్టర్‌గా నియమించింది. దీంతో భన్వర్‌లాల్ తన నివాసాన్ని ఖాళీ చేసి కొత్త అధికారికి అప్పగించాల్సి ఉంది. కానీ మే 9, 2006 వరకు భన్వర్‌లాల్ ఆ నివాసాన్ని ఖాళీ చేయకుండా అనధికారికంగా అందులో నివసించారు.
భన్వర్‌లాల్ చర్యలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం మే 3, 2005న ఆయనకు మెమో జారీ చేసింది. అయినా పట్టించుకోకపోవడంతో బలవంతంగానైనా ఖాళీ చేయించాలని ఎస్టేట్ అధికారిని ఆదేశించింది. అయినా భన్వర్‌లాల్ స్పందించకపోవడంతో బలవతంగా ఖాళీ చేయించారు. 70 నెలలపాటు బంగళాను అనధికారికంగా వినియోగించినందుకు గాను నెలకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.17.50 లక్షలు చెల్లించాలని ఆగస్టు 24, 2005న భన్వర్‌లాల్‌కు నోటీసు పంపారు.
అయితే భన్వర్‌లాల్ అంశాన్ని 2007లో సమీక్షించిన ప్రభుత్వం అపరాధ రుసుమును రూ.17.50 లక్షల నుంచి రూ.4.37 లక్షలకు కుదించింది. అంతేకాక నెలకు రూ.5 వేల చొప్పున 88 నెలలపాటు ఆయన వేతనం నుంచి వసూలు చేయాలంటూ జారీ చేసిన ఉత్తర్వులు కూడా విఫలమయ్యాయి. దీంతో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై క్రమ శిక్షణ చర్యలకు ఆదేశించింది. భన్వర్‌లాల్ మంగళవారం పదవీ విరమణ చేయగా కొన్ని గంటల్లోనే ఆయనపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.