karnataka: రాష్ట్ర డీజీపీగా తొలిసారి మహిళను నియమించిన కర్ణాటక ప్రభుత్వం
- డీజీపీగా నియమితురాలైన నీలమణి ఎన్ రాజు
- ఇవాళ పదవీ విరమణ చేసిన ప్రస్తుత డీజీపీ రూపక్ కుమార్ దత్తా
- అభినందనలు తెలియజేసిన సిద్ధరామయ్య
తొలిసారి రాష్ట్ర డీజీపీగా మహిళను నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1983 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన నీలమణి ఎన్ రాజు డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు. ఇవాళ సాయంత్రం నుంచి ఆమె విధుల్లో చేరనున్నారు. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న రూపక్ కుమార్ దత్తా ఇవాళ ఉదయం పదవీ విరమణ పొందారు. ఇప్పటి వరకు ఆమె అగ్నిమాపక, అత్యవసర సేవల డీజీపీగా, హోం గార్డ్స్ చీఫ్‌గా పనిచేశారు. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్‌గా కూడా ఆమె పని చేశారు. 2020 జనవరిలో రిటైర్ కానున్న నీలమణి రాజు అప్పటి వరకు కర్ణాటక డీజీపీగా సేవలందించనున్నారు. ఆమె నియామకానికి అభినందనలు తెలియజేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.