apcc: ఆ ఇద్దరు గొప్ప నేతలే మనకు ఆదర్శం: ఏపీసీసీ
- ఏపీసీసీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్థంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలు
- ఇందిరాగాంధీ చిన్న వయస్సులోనే రాజకీయ అనుభవం సంపాదించారు
- పటేల్ దేశానికి చేసిన సేవలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలి- ఏపీసీసీ
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం శ్రమించిన మహోన్నతురాలు మాజీ ప్రధాని, దివంగత
ఇందిరాగాంధీ అని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.జే రత్నకుమార్ అన్నారు. అలాగే దేశంలో అసమానతలను రూపుమాపటానికి, ప్రజల్లో ఐక్యత భావం పెంచటానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో ఇందిరా గాంధీ వర్థంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహించారు. తొలుత ఇందిరాగాంధీ, వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు ఎం.జె.రత్నకుమార్, ప్రధాన కార్యదర్శులు మీసాల రాజేశ్వరరావు, నరహరిశెట్టి నరసింహారావు, రాజీవ్ రతన్, అధికార ప్రతినిధి వి.గురునాథం, కొలనుకొండ శివాజీ, జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు ధనేకుల మురళీ, ఆకుల శ్రీనివాస్, కొరగంజి భాను తదితర కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ తండ్రికి చేదోడు, వాదోడుగా ఉన్న ఇందిరాగాంధీ చిన్న వయస్సులోనే రాజకీయ అనుభవం సంపాదించారని అన్నారు. 1959లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారన్నారు. 1966 జనవరి 24న ఇందిర మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించి దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించించారన్నారు. ఇప్పటివరకు మరో మహిళ ఆ స్థానాన్నిచేపట్టలేదని చెప్పారు. 1971లో తూర్పు పాకిస్థాన్‌ను ఆ దేశం నుండి విడదీసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళ కూడా ఇందిరా గాంధీ అని అన్నారు.
నూతన సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధిబాటలో నడిపించిన ఖ్యాతి ఇందిరమ్మకే దక్కుతుందన్నారు. అదేవిధంగా భారతదేశ ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన చేసిన త్యాగాలు, కృషి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. వారి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఏపీసీసీ నాయకులు పిలుపు నిచ్చారు.