teja: 'శివ' సినిమా గురించి ఆసక్తికరమైన సంగతులు చెప్పిన దర్శకుడు తేజ
- 'శివ' సినిమా కోసం చాలా శాఖల్లో పనిచేశాను
- 'శివ' టైటిల్ లోగో లోని నాగ్ ఫోటో 'విక్కీదాదా' కోసం తీసినది
- పోస్టర్లో సైకిల్ చైన్ పట్టుకుంది నాగ్ చేయి కాదు
- నెలకి 1500 జీతం తీసుకుంటూ పనిచేశాను
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'శివ' అప్పట్లో ఎలాంటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. నాగ్ లోని హీరోయిజాన్ని ఆవిష్కరించిన ఈ సినిమాను, ఈనాటికీ ఎవరూ మరిచిపోలేదు. దర్శకుడు తేజ ఈ సినిమా కోసం పలు శాఖల్లో పనిచేశాడట. ఆ విషయాన్ని గురించి తాజాగా తేజ ప్రస్తావిస్తూ .. " 'శివ సినిమాకి పబ్లిసిటీ ఇంచార్జ్ గా కూడా పనిచేశాను. అప్పటి వరకూ పోస్టర్స్ లో టైటిల్స్ కు పసుపురంగునే ఉపయోగించేవారు. తొలిసారిగా నేను ఈ సినిమా టైటిల్ కోసం ఎరుపురంగు వాడాను" అని చెప్పారు.
"ఇక 'శివ' టైటిల్ లోగోలో కనిపించే నాగ్ ఫోటో ఈ సినిమా కోసం తీసింది కాదు .. 'విక్కీదాదా' కోసం చేసిన ఫోటో షూట్ నుంచి ఆ స్టిల్ తీసుకున్నాం. ఈ సినిమా టైటిల్ పై సైకిల్ చైన్ పట్టుకున్న ఓ చెయ్యి ఉంటుంది .. ఆ చెయ్యి నాగార్జునది కాదు .. అది ఆయన సోదరుడు అక్కినేని వెంకట్ చేయి. ఈ సినిమా కోసం అప్పట్లో నేను నెలకి 1500 జీతం తీసుకుంటూ పనిచేశాను" అంటూ ఆసక్తికరమైన ఆనాటి సినిమా సంగతులను ఆయన చెప్పుకొచ్చారు.