las vegas: లాస్ వేగాస్ కాల్పుల నుంచి బయటపడ్డారు... 15 రోజులకు యాక్సిడెంట్‌లో చనిపోయారు
- అక్టోబర్ 1 కాల్పుల్లో తృటిలో తప్పించుకున్నారు
- అక్టోబర్ 16 యాక్సిడెంట్‌లో క్షణంలో ప్రాణాలు కోల్పోయారు
- ఇంటికి సమీపంలోనే మృత్యువాతపడ్డ అమెరికన్ జంట
అక్టోబర్ 1న లాస్‌వేగాస్‌లో జరుగుతున్న సంగీత కచేరీ సందర్భంగా ఉన్మాది స్టీఫెన్ పాడక్ జరిపిన కాల్పుల నుంచి అమెరికన్ దంపతులు డెన్నిస్ కార్వర్, లోరియన్ కార్వర్‌లు తృటిలో బయటపడ్డారు. కాల్పులు జరుగుతున్నపుడు భర్త డెన్నిస్, తనను కంటికి రెప్పలా కాపాడుతూ బయటికి తీసుకువచ్చాడని, ఆ మరుసటి రోజే తనకు గులాబి పూలు బహుమతిగా ఇచ్చాడని లోరియన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
కానీ దురదృష్టవశాత్తు కాల్పుల నుంచి బయటపడిన 15 రోజుల్లోనే వారి జంటను మృత్యువు మరో రూపంలో వెంటాడింది. అక్టోబర్ 16న వారి ఇంటికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డెన్నిస్, లోరియన్‌లు మృత్యువాత పడ్డారు. వారు ప్రయాణిస్తున్న బెంజ్ కారు మలుపు తిప్పుతుండగా అదుపు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. వారిద్దరూ అక్కడిక్కడే మరణించినట్లు దక్షిణ కాలిఫోర్నియా పోలీసులు తెలిపారు. వారికి బ్రూక్ (20), మాడిసన్ (16) అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కాల్పుల్లో తృటిలో బయటపడిన తర్వాత గడిచిన 15 రోజుల్లో వారు చాలా అద్భుతమైన జీవితం గడిపారని పిల్లలు అన్నారు.