Chris Gayle: మీడియాపై పరువునష్టం దావా గెలిచిన విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్
- తప్పుడు కథనం రాసిన ఫైర్‌ఫాక్స్ మీడియాపై గేల్ కేసు
- మీడియాకు సిడ్నీ కోర్టు మొట్టికాయలు
- తాను చాలా మంచివాడినన్న గేల్
విండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్‌గేల్ పరువునష్టం దావాలో గెలిచాడు. తన పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాసినందుకు గాను ఆస్ట్రేలియా మీడియా ‘ఫైర్‌ఫాక్స్’పై వేసిన కేసులో సిడ్నీ కోర్టు గేల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2015 ప్రపంచకప్ సందర్భంగా క్రిస్‌గేల్ జట్టు మసాజ్ థెరపిస్ట్ లీన్ రస్సెల్‌తో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఫైర్‌ఫాక్స్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ‘ద ఏజ్’, ‘ద కాన్‌బెర్రా టైమ్స్’ పత్రికల్లో ఈ కథనాలు ప్రచురితమయ్యాయి.
ఈ కథనాలపై కలత చెందిన గేల్ సిడ్నీ కోర్టులో కేసు వేశాడు. ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, అది పూర్తిగా తప్పుడు కథనమని పేర్కొన్నాడు. తన పరువుకు భంగం కలిగించిన ‘ఫైర్‌ఫాక్స్’పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ కేసును సోమవారం విచారించిన కోర్టు గేల్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. పాఠకులు ఆకర్షితులయేలా కథనాలు రాస్తున్నారు తప్పితే నిజానిజాలను విస్మరిస్తున్నారంటూ సదరు మీడియా సంస్థకు కోర్టు మొట్టికాయలు వేసింది. ఓ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుడి పట్ల కథనాలు రాసేముందు నిజానిజాలు నిర్ధారించుకోవాల్సిన పనిలేదా? అని ప్రశ్నించింది.
కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడంపై గేల్ హర్షం వ్యక్తం చేశాడు. తాను చాలా మంచి వ్యక్తినని పేర్కొన్నాడు. తనపై అటువంటి కథనం ప్రచురించినందుకు ఎంతగానో బాధపడ్డానని పేర్కొన్నాడు. అయితే తాను డబ్బు కోసం కేసు వేయలేదన్నాడు. ఈ సందర్బంగా తన లీగల్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.