sridhar: ప్రముఖ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ హఠాన్మరణం!
- గుండెపోటుకు గురైన శ్రీధర్
- స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- గతంలో హైదరాబాదు రంజీ టీమ్ కి ప్రాతినిధ్యం వహించిన శ్రీధర్
ప్రముఖ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ (51) ఈ రోజు హఠాన్మరణం చెందారు. ఈ రోజు గుండెపోటుకు గురైన శ్రీధర్ ను హైదరాబాదులోని స్టార్ ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గతంలో హైదరాబాద్ రంజీ క్రికెట్ జట్టుకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. వైద్య వృత్తిని పూర్తి చేసిన ఎంవీ శ్రీధర్.. క్రికెట్ పైనే ఆసక్తిని చూపారు. హెచ్‌సీఏ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
గతంలో హైదరాబాద్ తరఫున రంజీ మ్యాచుల్లో ఆడిన ఎంవీ శ్రీధర్... తన కెరీర్‌లో 48.91 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 6701 పరుగులు చేశారు. అందులో 21 సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు, ఆయన తన కెరీర్‌లో (1993-94 సీజన్‌లో) త్రి శతకం (366) కూడా చేశారు. క్రికెటర్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టిన శ్రీధర్... టీమిండియా 2007-08లో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు మేనేజర్‌గా కూడా వ్యవహరించారు.
భారత్‌లో 2016లో నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
2013లో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఎన్.శ్రీనివాసన్ ఉన్న సమయంలో ఎంవీ శ్రీధర్... బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జీఎంగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అదే సమయంలో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లు ఆడే మెన్, ఉమెన్, యూత్ క్రికెట్ టోర్నమెంట్ల షెడ్యూళ్లను ఖరారు చేసే బాధ్యతను కూడా నిర్వర్తించారు.
ఎంవీ శ్రీధర్ మృతిపై స్పందించిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. చాలా నిబద్ధతతో పనిచేసే వ్యక్తి ఎంవీ శ్రీధర్ అని, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. గతంలో తాను, ఎంవీ శ్రీధర్ హైదరాబాద్ టీమ్‌లో ఆడామని గుర్తు చేశారు.