sushma swaraj: సుష్మా స్వరాజ్ సహాయం కోరిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్
- సౌదీలో చిక్కుకున్న తల్లీకూతుళ్లని కాపాడాలని కోరిన సీఎం
- ట్విట్టర్ ద్వారా సంప్రదించిన అమరీందర్
- వార్తా పత్రిక కథనాన్ని షేర్ చేసిన పంజాబ్ సీఎం
విదేశాల్లో క్లిష్టపరిస్థితుల్లో ఉన్న భారతీయులకు సహాయం చేయడానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చాలా క్రియాశీలకంగా ఉంటారు. ఈ విషయం దేశంలో అందరికీ తెలుసు. ఆమె పనితనంతో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల వద్ద కూడా సుష్మా మార్కులు కొట్టేశారు. దీనికి నిదర్శనం ఇవాళ ట్విట్టర్‌లో కనిపించింది. సౌదీ అరేబియాలో చిక్కుకున్న పంజాబీ తల్లీకూతుళ్లను ఎలాగైనా కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ట్విట్టర్ వేదికగా సుష్మా స్వరాజ్‌ను కోరారు.
`నవాన్‌షహర్ ప్రాంతానికి చెందిన ఈ తల్లీకూతుళ్లు సౌదీ అరేబియాలో చిక్కుకుపోయారు. వారిని కాపాడే చర్యలు తీసుకోండి. కొంచెం అత్యవసరం` అంటూ తల్లీకూతుళ్ల కథనం ప్రచురితమైన వార్తాపత్రిక క్లిప్‌ను అమరీందర్ సింగ్ షేర్ చేశారు. ఆ కథనం ప్రకారం బాధితురాలు కౌర్, ఆమె కూతురు కలిసి మలేషియా వెళ్లాల్సి ఉంది. కాకపోతే ఏజెంట్లు మధ్యలో అడ్డగించి వారిని సౌదీ అరేబియా పంపించారు. అక్కడ వారికి పని కూడా ఇప్పించారు. కానీ ఇటీవల కౌర్‌ను పనిలో నుంచి తీసేశారు. అలాగే ఆమె కూతురిని కూడా తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారు. వాళ్లిద్దరినీ కాపాడాలంటూ కౌర్ ఓ వీడియో మెసేజ్ ద్వారా సుష్మా స్వరాజ్‌ను కోరినట్లు తెలుస్తోంది.