wireless connectivity: వైర్లెస్ కనెక్టివిటీ వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు... హెచ్చరిస్తున్న నిపుణులు!
- బ్రెయిన్ ట్యూమర్, ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశం
- తెలియకుండానే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న వైర్లెస్ రేడియేషన్
- వైద్యులకు అంతుచిక్కని రోగాలు వచ్చే ప్రమాదం
అభివృద్ధి చెందుతున్న సాంకేతికత కారణంగా నిత్యజీవితంలో వైర్లెస్ కనెక్టివిటీ ఒక భాగమైపోయింది. సెల్‌ఫోన్ సిగ్నళ్లు, వై ఫై టెక్నాలజీ, రిమోట్ వర్కింగ్ వంటి విధానాల వల్ల తెలియకుండానే మానవ ఆరోగ్యం వైర్లెస్ సిగ్నళ్ల రేడియేషన్‌కి గురవుతోంది. ఇలా ఎక్కువ కాలం రేడియేషన్‌కి ప్రభావితం అవడం వల్ల బ్రెయిన్ ట్యూమర్, ఇన్ఫెర్టిలిటీ వంటి సమస్యలతో పాటు అంతుచిక్కని రోగాలు కూడా వచ్చే అవకాశముందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా రోగాల లక్షణాలకు కారణాలను అంచనా వేయలేకపోతున్నామని వారు అంటున్నారు.
ఈ విషయానికి సంబంధించి ఎలక్ట్రో మేగ్నటిక్ రేడియేషన్ ప్రభావం వల్ల కలిగే వ్యాధుల మీద పరిశోధన చేసిన ప్రముఖ ముక్కు, గొంతు, చెవి వైద్యుడు వికాస్ నెహ్రూ కొన్ని విషయాలు వెల్లడించారు. 1985 నుంచి డాక్టర్‌గా సేవలందిస్తున్న ఆయన గడచిన పదేళ్లలో తన దగ్గరికి వచ్చే పేషెంట్లలో చాలా మంది చెబుతున్న వ్యాధి లక్షణాలను అంచనా వేయలేకపోతున్నట్లుగా తెలిపారు. దీనికి కారణం గత పదేళ్లుగా అభివృద్ధి చెందుతున్న వైర్లెస్ కనెక్టివిటీ అని ఆయన ఇటీవల విడుదల చేసిన `గ్లోబల్ వైర్లెస్ స్పైడర్‌వెబ్` పుస్తకంలో వివరించారు.
వైర్లెస్ పరికరాల నుంచి వచ్చే ఎలక్ట్రో మేగ్నటిక్ రేడియేషన్ వల్ల గుర్తుతెలియని వ్యాధులు వస్తున్నాయని, వాటిని గుర్తించడం గానీ, నివారించడం గానీ అందుబాటులో ఉన్న చికిత్సల వల్ల సాధ్యం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. రోజురోజుకీ వైర్లెస్ రేడియేషన్ తరంగాల సాంద్రత పెరుగుతోందని, దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని వికాస్ నెహ్రూ అన్నారు.