virat kohli: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్న విరాట్ కోహ్లీ
- గతవారం మొదటి స్థానాన్ని కోల్పోయిన భారత కెప్టెన్
- సచిన్ కన్నా ఎక్కువ ర్యాంకింగ్ పాయింట్లు
- మూడో స్థానానికి చేరిన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా
తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకుల్లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతేకాకుండా తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకింగ్ పాయింట్లను కూడా సాధించాడు. ర్యాంకింగ్ పాయింట్ల విషయంలో విరాట్, సచిన్ టెండూల్కర్‌ను అధిగమించడం విశేషం. గతవారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ రెండో స్థానానికి పడిపోగా, ఏబీ డివిలియర్స్ మొదటిస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో విజయం సాధించడంతో విరాట్ మళ్లీ మొదటిస్థానాన్ని కైవసం చేసుకోగలిగాడు. ఈ సిరీస్‌లో విరాట్ 263 పరుగులు చేయడంతో 889 ర్యాంకింగ్ పాయింట్లకు చేరుకోగలిగాడు. ఇప్పటి వరకు 889 ర్యాంకింగ్ పాయింట్లు సాధించిన మొదటి భారత క్రికెటర్ విరాట్. 1998లో సచిన్ 887 ర్యాంకింగ్ పాయింట్లు సాధించాడు. ఇక మిగతా బ్యాట్స్‌మన్ల విషయానికి వస్తే.. ధోని 11వ ర్యాంకులో, రోహిత్ శర్మ 7వ ర్యాంకులో ఉన్నారు.
బౌలర్లలో పాకిస్థాన్ పేస్ బౌలర్ హసన్ అలీ మొదటి ర్యాంకు సాధించగా భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మూడో స్థానానికి చేరుకున్నాడు. అతని కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. ఇక జట్ల ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు మొదటి ర్యాంక్‌లో, భారత్ రెండో ర్యాంక్‌లో ఉంది.