telangana: జానారెడ్డి డిమాండ్ కు ససేమిరా అన్న హరీశ్ రావు... కాంగ్రెస్ వాకౌట్!
- ఫీజు రీఎంబర్స్ మెంట్ పై చర్చకు కాంగ్రెస్ పట్టు
- ప్రశ్నోత్తరాలే ముందన్న హరీశ్ రావు
- వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించిన జానారెడ్డి
ప్రశ్నోత్తరాల తరువాత మాత్రమే వాయిదా తీర్మానాలపై చర్చించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో నిర్ణయం తీసుకున్న మాట నిజమే అయినా, అత్యవసరమైన సమస్యలైతే, ముందుగానే సభలో చర్చించాలని తాము చెప్పినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈ ఉదయం తెలంగాణ అసెంబ్లీ నుంచి విపక్ష కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఉదయం సభ ప్రారంభమైన తరువాత ఫీజు రీఎంబర్స్ మెంట్ పై చర్చించాలని కాంగ్రెస్ నేత జానారెడ్డి పట్టుబట్టగా, అధికార పక్షం సరేమిరా అంది.
శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, బీఏసీ నిర్ణయాల గురించి చెప్పి, నియమాలను ఉల్లంఘించ వద్దని హితవు పలికారు. నిబంధనలకు అనుగుణంగానే సభ నడుస్తుందని స్పష్టం చేశారు. అయినప్పటికీ, కాంగ్రెస్ వాకౌట్ చేసి వెళ్లిపోవడంతో, హరీశ్ విమర్శించారు. రాజకీయ అనుభవమున్న కాంగ్రెస్ పార్టీ ఇలా చేయడం భావ్యం కాదని, అసలు కాంగ్రెస్ బయటకు వెళ్లేందుకే సభకు వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు.