Telugudesam: టీటీడీపీలో రాజీనామాల హోరు.. రేవంత్ వెంటే పలువురు నేతలు!
- రేవంత్ రాజీనామాతో తెలంగాణలో టీడీపీ ఖాళీ
- రేవంత్ వెంట క్యూ కడుతున్న నేతలు
- కొనసాగుతున్న రాజీనామాల పర్వం
టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి వెళ్తూ వెళ్తూ, తెలంగాణ టీడీపీలోని పలువుర్ని తన వెంట తీసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఆయనతో పాటు వెళ్లేందుకు నేతలు క్యూకడుతున్నారు. వరసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయి వరకు పలువురు నేతలు ఆదివారం తమ పదవులకు, పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేసి తాము రేవంత్ వెంటే.. అని ప్రకటించారు.
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేం నరేందర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. మాజీ మంత్రి , మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బోడ జనార్దన్ నేడు (సోమవారం) పార్టీకి రాజీనామా చేయనున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సతీష్ మాదిగ, మేడిపల్లి సత్యంతోపాటు అచ్చంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ చారగొండ వెంకటేశ్ ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక రేవంత్ పార్టీ నుంచి వెళ్లిపోవడానికి కారణమేంటో తనకు తెలుసని వ్యాఖ్యానించి అధిష్ఠానం నుంచి షోకాజ్ నోటీసు అందుకున్న నల్గొండ నేత కంచర్ల భూపాల్‌రెడ్డి మొదట్లో రేవంత్ వెంట వెళతారని వార్తలు వచ్చినప్పటికీ, ఆయన చూపు ఇప్పుడు టీఆర్ఎస్ వైపు వున్నట్టు తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన పార్టీ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి నేడు (సోమవారం) పార్టీని వీడనున్నారు. సూర్యాపేట జిల్లా టీడీపీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆదివారమే పార్టీకి రాజీనామా చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్ రెడ్డి కూడా పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. టీడీపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కూడా పార్టీని వీడడం దాదాపు ఖాయమైంది.