indrakeeladri: ఇంద్రకీలాద్రిపై అపచారం... వల్లీ అమ్మవారి మంగళసూత్రం తాకట్టు!
- గుర్తించి విడిపించుకుని తెచ్చిన అధికారులు
- బహిరంగంగా మాట్లాడేందుకు నిరాకరణ
- ఇంకా ఎన్ని ఆభరణాలు తాకట్టు పెట్టారో?
- భక్తుల అనుమానం!
కనకదుర్గమ్మ కొలువై ఉండే విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపచారం జరిగింది. కొండపై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉపాలయంలోని శ్రీవల్లీ అమ్మవారి మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టారన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ఓ అర్చకుడు ఈ పని చేశాడని భావిస్తుండగా, అధికారులు ఆగమేఘాల మీద మంగళసూత్రాన్ని విడిపించుకుని తెచ్చి, తిరిగి అమ్మవారికి అలంకరించినట్టు తెలుస్తోంది.
ఈ విషయంలో వివరణ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. అంతర్గతంగా విచారణ జరుగుతోందని, తప్పు ఎవరు చేసినా శిక్ష ఉంటుందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి పేర్కొన్నారు. కాగా, కొందరు అధికారుల ప్రోద్బలంతోనే కొండపై ఇటువంటివి జరుగుతున్నాయని, ఇంకా దేవీ, స్వామివార్లకు చెందిన ఎన్ని ఆభరణాలు ఇలా బయటకు వెళ్లాయో లెక్క తేల్చాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.