modi: ఇందిరా గాంధీ మహానేత...: తలచుకున్న నరేంద్ర మోదీ

  • ప్రజల మనసుల్లో ఇంకా ఇందిరమ్మ పాలన
  • 37వ మన్ కీ బాత్ ప్రసంగంలో నరేంద్ర మోదీ 
  • పటేల్ చొరవ వల్లే ఐక్య భారత్
  • నేటి మ్యాచ్ లో కిడాంబి గెలవాలని కోరిన మోదీ 

భారతదేశానికి ఇందిరాగాంధీ వంటి మహానేత లభించడం ప్రజల అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆకాశవాణి మాధ్యమంగా తన 37వ 'మన్ కీ బాత్' ప్రసంగాన్ని వినిపించిన ఆయన, ఇందిర పాలనను దేశ ప్రజలు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సైతం జాతికెంతో సేవ చేశాడని, ఆయన చొరవవల్లే భారత్ ఇప్పుడు ఒక దేశంగా ఉందని అన్నారు. ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా తలపెట్టిన ఐక్యతా యాత్రను విజయవంతం చేయాలని కోరారు. అక్టోబర్ 31 జాతికెంతో విలువైన దినమని, అదే రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జరుపుకుంటామని, ఇందిరమ్మ దూరమైన రోజు కూడా అదేనని గుర్తు చేశారు.

మరో రెండేళ్లలో గురునానక్ 550వ ప్రకాష్ వర్ష్ జరగనుందని, ఈ ఉత్సవాలు ఏడాది పాటు జరుగుతాయని అన్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను, వారసత్వ సంపదను కాపాడుకుంటూ భావి తరాల వారికి అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని అన్నారు. ఎకోలాజికల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ చంద్రపూర్ కోట వద్ద 200 రోజుల స్వచ్ఛ భారత్ నిర్వహించి, 'బిఫోర్ అండ్ ఆఫ్టర్' అన్న క్యాప్షన్ తో ఫొటోలు పెట్టిందని, అవి తనకెంతో నచ్చాయని, వారి కృషి సర్వదా అభినందనీయమని అన్నారు.

శనివారం ముగిసిన ఫీఫా అండర్ 17 వరల్డ్ కప్ పోటీల్లో భారత జట్టు కప్ గెలవకపోయినా, 125 కోట్ల మంది మనసులను గెలుచుకున్నారని అభినందించారు. పాల్గొన్న అన్ని టీమ్ లకూ శుభాభినందనలు తెలిపారు. డెన్మార్క్ ఓపెన్ లో టైటిల్ సాధించిన కిడాంబి శ్రీకాంత్ కు శుభాకాంక్షలు తెలుపుతూ నేడు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను కూడా గెలవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. పది సంవత్సరాల తరువాత ఆసియా కప్ గెలిచిన హాకీ టీమ్ కూ ఆయన అభినందనలు తెలిపారు.

నేటి చిన్నారులే రేపటి భావి భారత పౌరులని వ్యాఖ్యానించిన ప్రధాని నరేంద్ర మోదీ, వారిని సరైన మార్గంలో నడిపే బాధ్యత తల్లిదండ్రులకన్నా ఉపాధ్యాయులపైనే అధికంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరినీ బాధించే లైఫ్ స్టయిల్ వ్యాధులైన మధుమేహం వంటి వాటిని దరిచేరనీయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జీవన నడవడికపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలని సూచించారు.

  • Loading...

More Telugu News