malda: రోడ్లు ఆక్రమించారని ఆరోపిస్తూ తనిఖీలకు వెళ్లిన రాజ్ థాకరే ప్రైవేటు ఆర్మీ... చావగొట్టిన తోపుడు బండ్ల వ్యాపారులు!
- ముంబై మాల్దా రైల్వే స్టేషన్ వద్ద ఘటన
- నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
- దాడికి వెళ్లిన 15 మంది
- రాడ్లు, కర్రలతో దాడికి వచ్చిన 100 మంది
ముంబైలో రోడ్లను ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ, రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు మాల్దా రైల్వేస్టేషన్ ప్రాంతంలో తనిఖీలకు వెళ్లగా, చుక్కెదురై చావు దెబ్బలు తిన్నారు. రాజ్ థాకరే ప్రైవేటు సైన్యంగా చెప్పుకునే దాదాపు 15 మంది ఎంఎన్ఎస్ కార్యకర్తలను చుట్టుముట్టిన 100 మంది తోపుడు బళ్ల వ్యాపారులు, చిరు దుకాణాల వారు కర్రలతో దాడి చేసి తీవ్రంగా బాదారు. వ్యాపారులు తక్షణం అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ, ఈ 15 మంది దుకాణాలపై దాడులకు దిగుతుండగా, ఇనుప రాడ్లు, కర్రలతో వచ్చిన 100 మంది వీరిపైబడి విచక్షణారహితంగా కొట్టారు.
దాడిలో నలుగురు కార్యకర్తలకు గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతని తలకు బలమైన గాయాలు కాగా, జాన్వీ ఆసుపత్రిలో చేర్చినట్టు ఎంఎన్ఎస్ వర్గాలు తెలిపాయి. దాడి చేసిన చిరు వ్యాపారుల్లో నలుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. తాము వస్తామన్న విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్, తోపుడుబళ్ల వాళ్లతో సమావేశమై ఈ దాడికి పురిగొల్పారని ఎంఎన్ఎస్ ఆరోపించింది. అక్టోబర్ 15న ఎల్విన్ స్టోన్ స్టేషన్ లో తొక్కిసలాట జరిగి 23 మంది ప్రాణాలు పోయిన అనంతరం, లోకల్ రైల్వే స్టేషన్ల బయట చిరు వ్యాపారులను, తోపుడుబళ్ల వాళ్లను ఖాళీ చేయిస్తామని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే ప్రతినబూనిన సంగతి తెలిసిందే.