revant reddy: నల్గొండ టీడీపీ ఖాళీ... రేవంత్ వెంటే ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి కూడా?
- తెలంగాణలో మారిన సమీకరణలు
- నల్గొండ జిల్లా రెడ్డి వర్గమంతా రేవంత్ వైపే
- కంచర్ల, పటేల్ ఫిరాయింపు ఖాయం
- తేల్చుకోలేని స్థితిలో ఉమా మాధవరెడ్డి
తన ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన తరువాత, తెలంగాణలో, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. రెడ్డి వర్గం నేతలు అత్యధికంగా ఉన్న పూర్వపు నల్గొండ జిల్లాలోని పలువురు నేతలు ఇప్పుడు రేవంత్ వెంట నడిచేందుకు సిద్దమవుతున్నారు. అధికారికంగా ఎవరి పేర్లూ బయటకు రాకపోయినా, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు చెందిన ప్రధాన నేతల్లో మోత్కుపల్లి నర్సింహులు మినహా మిగతా వారంతా రేవంత్ వెంట వెళ్లిపోయేట్టు కనిపిస్తోంది. సుమారు 25 మంది ముఖ్య నేతలు కాంగ్రెస్ లోకి చేరనున్నారని తెలుస్తోంది.
ఈ జిల్లాల్లో పార్టీని నడిపిస్తున్న వారిలో దివంగత హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు కీలక వ్యక్తులు. నర్సింహులు మినహా మిగతావారు రేవంత్ వెంట వెళితే, పార్టీకి పెను నష్టమే జరుగుతుంది. కంచర్ల భూపాల్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిలు టీడీపీని వీడటం లాంఛనమేనని తెలుస్తోంది.
కంచర్ల భూపాల్ రెడ్డి రేవంత్ వెంట వెళ్లటానికి సుముఖంగా ఉన్నారని తెలుస్తుండగా, పటేల్ రమేష్ రెడ్డి, రేవంత్ లు, చిన్నప్పటి నుంచి మిత్రులు, కలసి చదువుకున్న వారు కావడంతో ఆయన కాంగ్రెస్ చేరిక ఖాయంగానే ఉంది. ఎటొచ్చీ, ఉమా మాధవరెడ్డి మాత్రం ఇంకా కొంత మీమాసంలో ఉన్నారు. కొందరు కార్యకర్తలు పార్టీ మారవద్దని ఆమెపై ఒత్తిడి తెస్తుండగా, మరికొందరు టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఎలాగన్న ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రేవంత్ తో వెళ్లేదెవరు? టీడీపీలోనే ఉండేదెవరు అన్న విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.