Pakistan: ఒకే మ్యాచ్‌లో పాక్, శ్రీలంక రికార్డుల మోత.. ఒకటి పరమ చెత్తది.. మరోటి సరికొత్తది!
- కొనసాగుతున్న శ్రీలంక పరాజయాలు
- ఒకే కేలండర్ ఇయర్‌లో అత్యధిక ఓటములు మూటగట్టుకున్న లంకేయులు
- వరుసగా అత్యధిక ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకున్న జట్టుగా పాక్ రికార్డు
పాకిస్థాన్-శ్రీలంక మధ్య దుబాయ్‌లో జరిగిన రెండో టీ20లో రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఇందులో ఒకటి అత్యంత చెత్త రికార్డు కాగా, రెండోది ఘనమైన రికార్డు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 124 పరుగులు చేసి పాకిస్థాన్‌కు 125 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి పాక్ ఓ బంతి మిగిలి ఉండగా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో పోరాడి ఓడిన శ్రీలంక అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. శ్రీలంకకు ఇది ఈ ఏడాది 33వ పరాజయం. ఓ కేలండర్ ఇయర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇన్ని మ్యాచుల్లో ఓ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు జింబాబ్వే పేరుపై ఉండగా, శ్రీలంక ఆ జట్టును వెనక్కి నెట్టింది. మరోవైపు ఇదే మ్యాచ్‌లో గెలవడం ద్వారా పాక్ సరికొత్త రికార్డును లిఖించింది. టీ20 చరిత్రలో వరుసగా ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకున్న జట్టుగా పాక్ రికార్డులకెక్కింది.