padmavathi: 'పద్మావతి' చిత్రంలో 'పోటుగాడు' హీరోయిన్!
- రతన్ సింగ్ మొదటి భార్య నాగ్‌మతిగా నటించిన అనుప్రియ గోయెంకా
- `ఘూమర్` పాటలో కనిపించిన నాగ్‌మతి
- ప్రాధాన్యమున్న పాత్ర అంటున్న నెటిజన్లు
మంచు మనోజ్ నటించిన `పోటుగాడు` చిత్రంలో `దేవత... ఓ దేవత` అనే పాటలో కనిపించే హీరోయిన్ గుర్తుంది కదా! ఆమె పేరు అనుప్రియ గోయెంకా. ఆమె ఇప్పుడు ఇంటర్నెట్‌లో మిస్టరీ మహారాణిగా ట్రెండ్ సెట్ చేస్తోంది. ఎలాగంటారా... ఇటీవల దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్‌లు నటించిన సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్ఠాత్మక చిత్రం `పద్మావతి`లోని మొదటి పాట `ఘూమర్`ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఒక్కరోజులోనే మిలియన్ కి పైగా వీక్షణలు తెచ్చుకున్న ఈ పాట టాప్ ట్రెండ్‌గా మారింది. అయితే ఈ పాటలో రతన్ సింగ్ పాత్ర పోషించిన షాహిద్, పద్మావతిగా నటించిన దీపికాలతో పాటు మరో పాత్రను కూడా చూపించారు. పద్మావతి నృత్యం చేస్తున్నప్పుడు తీక్షణంగా చూస్తున్న మహారాణి ఎవరనే విషయం మొదట్లో అర్థం కాలేదు. అయినప్పటికీ ఆ ఒక్క క్షణంలో ఆమె చూపించిన హావభావాలను మాత్రం పొగడ్తలతో ముంచెత్తేశారు. దీంతో ఆమె ఎవరని విచారిస్తే... అనుప్రియ గోయెంకా అనే విషయం తెలిసింది.
ఈ చిత్రంలో ఆమె రతన్‌సింగ్ మొదటి భార్య మహారాణి నాగ్‌మతి పాత్రలో నటించినట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో ఆమె పాత్రకు కూడా చాలా ప్రాధాన్యమున్నట్లు నెటిజన్లు చెప్పుకుంటారు. అయితే వారి ఆలోచన ఎంత వరకు నిజమో తెలియాలంటే డిసెంబరు 1 వరకు వేచిచూడాల్సిందే. 'పోటుగాడు' చిత్రంతో పాటు తెలుగులో `పాఠశాల` అనే చిత్రంలోనూ నటించింది. అలాగే కొన్ని వ్యాపార ప్రకటనల్లో కూడా కనిపించింది.