AADHAAR: మరోసారి బయటపడిన ఆధార్ నిర్వాకం... ఒకే ఊరిలో 800ల మందికి ఒకే పుట్టిన తేదీ!
- ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గైందీ ఖటా గ్రామంలో ఘటన
- సాంకేతిక తప్పిదం అంటున్న యూఐడీఏఐ
- విచారణ చేపడతామని హామీ ఇచ్చిన సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గైందీ ఖటా గ్రామ ప్రజలకు జారీ చేసిన కొత్త ఆధార్ కార్డుల్లో 800ల మంది పుట్టిన రోజు జనవరి 1 అని పడటంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సమస్యల్లో పడింది. అయితే ఇది సాంకేతిక తప్పిదం వల్ల జరిగి ఉంటుందని యూఐడీఏఐ చెబుతోంది. సాధారణంగా పుట్టిన తేదీ తెలియని వారికి, లేదా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించలేని వారికి, వారి వయసుల ఆధారంగా పుట్టిన సంవత్సరాన్ని అంచనా వేసి జనవరి 1వ తేదీని పుట్టిన తేదీగా కంప్యూటరే కేటాయిస్తుందని స్పష్టతనిచ్చింది.
అందరి పుట్టినరోజులు ఒకేలా ఉన్నపుడు ఇక ఆధార్‌ని ప్రత్యేక సంఖ్య అనడంలో అర్థం ఏముందని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ తప్పిదానికి కారణాలేంటో తెలుసుకోవడానికి విచారణ చేపడతామని, అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హరిద్వార్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ మనీష్ కుమార్ హామీ ఇచ్చారు. ఈలోగా పుట్టిన తేదీ తెలిసిన వారు, ధ్రువీకరణ పత్రాలు తీసుకుని అందుబాటులో ఉన్న ఆధార్ కేంద్రాల ద్వారా అప్‌డేట్ చేసుకునే వీలుందని యూఐడీఏఐ తెలిపింది.