malaysia: మలేషియాలో చిక్కుకుపోయిన భారత కుటుంబం.. సహాయం చేసిన సుష్మాస్వరాజ్
- ట్వీట్‌కి స్పందించిన విదేశాంగ మంత్రి
- సహాయం చేయాలని మలేషియా భారత ఎంబసీకి ఆదేశం
- సెలవు దినం అయినప్పటికీ సహాయం చేసిన భారత ఎంబసీ
విదేశీయులకు భారత్‌తో అవసరం ఉన్నా, విదేశాల్లో భారతీయులకు అవసరం ఉన్నా నేనున్నానంటూ భరోసా ఇచ్చే కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్. మలేషియాలో పాస్‌పోర్ట్ పోగొట్టుకుని ఇబ్బంది పడిన ఓ భారతీయ కుటుంబానికి సహాయం చేసి మరోసారి తన బాధ్యతను నిర్వర్తించారు విదేశాంగ మంత్రి. వారాంతం సందర్భంగా మలేషియాలో భారత దౌత్య కార్యాలయం మూసి ఉండటంతో పాస్‌పోర్టులు పోగొట్టుకున్న భారతీయ కుటుంబం ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తమ కుటుంబం గురించి సుష్మాకు తెలియజేస్తూ మీరా రమేశ్ పటేల్ అనే మహిళ ట్వీట్ చేసింది.
ఆ ట్వీట్‌కు వెంటనే స్పందిస్తూ... `ఇది చాలా అత్యవసర విషయం.. దయచేసి కార్యాలయాన్ని తెరిచి భారతీయ కుటుంబానికి సహాయం చేయండి` అంటూ మలేషియాలోని భారత దౌత్య కార్యాలయాన్ని సుష్మా స్వరాజ్ ట్వీట్ ద్వారా ఆదేశించారు. తర్వాత కాసేపటికి ఆ కుటుంబానికి సహాయం చేసి, సమస్యను పరిష్కరించినట్లుగా భారత దౌత్యకార్యాలయం తిరిగి సమాధానం చెప్పింది.