donald trump: అధ్యక్షుడిగా మొదటి హాలోవీన్ పండగను చేసుకున్న ట్రంప్.. జర్నలిస్టుల పిల్లలతో ముచ్చట్లు!
- శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్‌లో పిల్లలతో ముచ్చటించిన అధ్యక్షుడు
- హాలోవీన్ వేషధారణలో హాజరైన పిల్లలు
- అక్టోబర్ 30న వైట్‌హౌస్‌లో అధికారికంగా హాలోవీన్ వేడుకలు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తన మొదటి హాలోవీన్ పండగను డొనాల్డ్ ట్రంప్ చిన్న పిల్లలతో జరుపుకున్నాడు. శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్‌లో మీడియా ప్రతినిధులు ఏర్పాటు చేసిన హాలోవీన్ పార్టీలో ట్రంప్ పాల్గొన్నారు. హాలోవీన్ పండగ సందర్భంగా వివిధ వేషధారణల్లో హాజరైన పిల్లలతో ట్రంప్ ముచ్చటించారు. ఈ పిల్లలంతా మీడియా ప్రతినిధుల పిల్లలు కావడంతో సాధారణంగా తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసే మీడియా ప్రతినిధులపై ట్రంప్ కొన్ని వ్యంగ్యాస్త్రాలు వదిలారు.
`మీరు పెద్దయ్యాక మీ తల్లిదండ్రుల లాగ అవుతారా?` అని ట్రంప్ పిల్లలను ప్రశ్నించాడురు. వారు సమాధానం చెప్పేలోపే `వద్దు.. సమాధానం చెప్పి మరీ నన్ను ఎక్కువ సమస్యల్లోకి నెట్టొద్దు` అన్నారు. `పిల్లలు చాలా అందంగా ఉన్నారు. మీడియా ప్రతినిధుల పిల్లలు అంటే నమ్మలేకపోతున్నా!` అని ట్రంప్ జోక్ చేశారు.
అంతేకాకుండా `మీడియా మిమ్మల్ని ఎలా చూసుకుంటోది?` అని ప్రశ్నించారు. మళ్లీ వాళ్లు సమాధానం చెప్పే లోగానే `ప్రపంచంలో అందరి కంటే బాగా చూసుకుంటూ ఉంటుందిలే!` అంటూ మళ్లీ ఛలోక్తి విసిరారు. పక్కనే ఏడుస్తూ ఉన్న జపాన్ అమ్మాయిని ట్రంప్ బుజ్జగించారు. చివరగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ వచ్చి పిల్లలకు చాక్లెట్లు పంచింది.
అప్పుడు ట్రంప్ ... `ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. మీ స్నేహితుల కోసం కూడా పట్టుకెళ్లండి` అన్నారు. అనంతరం అక్టోబర్ 30న వైట్‌హౌస్‌లో అధికారికంగా హాలోవీన్ వేడుకలు జరుగుతాయని, ఇందులో భాగంగా పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశామని ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వెల్లడించింది.