ola: సమోసాలు పంపి వినియోగదారుడిని తృప్తి పరిచిన ఓలా క్యాబ్స్!
- ఓలా కేన్సిలేషన్ పాలసీని వ్యంగ్యంగా పోల్చిన వినియోగదారుడు
- వ్యంగ్య ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకున్న ఓలా
- కేజీ సమోసాలు పంపి ఆశ్చర్యపరిచిన క్యాబ్ సంస్థ
ఓలా, ఉబెర్ క్యాబ్ సర్వీసులు రోజువారీ జీవితంలో ఓ భాగంగా మారిపోయాయి. ఇంటి ముందుకే వచ్చి పికప్ చేసుకోవడం, కోరుకున్న గమ్యస్థానం వద్ద దించడం వంటి సేవలను అందిస్తున్నాయి. కొన్ని సార్లు కోరుకున్న స్థానానికి చేరవేయలేని డ్రైవర్లు రైడ్‌ను రద్దు చేస్తారు. అలాంటప్పుడు రద్దు చేసినందుకు జరిమానాలను వినియోగదారుడే చెల్లించాల్సి వస్తుంది. ఈ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉన్నా చాలా పెద్ద ప్రాసెస్ అవడంతో వదిలేస్తారు.
అయితే పూణెకు చెందిన అభిషేక్ అస్తానా మాత్రం అలా వదిలేయలేదు. ఈ పద్ధతి గురించి వ్యంగ్యంగా ఓ ట్వీట్ చేశాడు. `డ్రైవర్ రద్దు చేసిన రైడ్‌కి కూడా ఓలా వారు ప్రయాణికుడి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే... సమోసా దుకాణానికి వెళ్లి... సమోసా తినకుండా రూ. 10 ఇచ్చినట్లు ఉంది` అని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌ను ఓలా కస్టమర్ సపోర్ట్ చాలా సీరియస్‌గా తీసుకుంది. `ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి.. డబ్బులు తిరిగి చెల్లిస్తాం. సమోసాలు ఎక్కడికి పంపించాలి?` అని అభిషేక్‌ని అడిగింది. అయితే ఈ ట్వీట్‌ను అభిషేక్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రెండ్రోజులకు అతని ఇంటికి కేజీ సమోసాలు వచ్చాయి. అభిషేక్ చిరునామా కనుక్కుని ఓలా సంస్థ వాటిని పంపించింది. సమోసాలను, ఓలా ఉత్తరాన్ని ఫొటో తీసి అభిషేక్ మళ్లీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు హాస్యఛలోక్తులు విసిరారు. `నువ్వు సమోసాలతో కాకుండా ఐఫోన్‌తో పోల్చి ఉండాల్సింది`, `ఓలాకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చావ్!` అంటూ కామెంట్లు చేశారు.