tomato: లారీడు టమోటాలు ఆ మంత్రిపై గుమ్మరిస్తే కానీ తెలిసేలా లేదు: పాక్ పత్రిక 'డాన్' ఆగ్రహం
- పాకిస్థాన్ లో కేజీ టమోటా 300 రూపాయలు
- అమృతసర్ లో కేజీ టమోటా 40 రూపాయల
- పాక్ ప్రజాప్రతినిధులపై మండిపడిన డాన్ పత్రిక
పాకిస్థాన్ లో టమోటా ధరపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై డాన్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. భారత్ నుంచి టమోటాలు దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ జాతీయత పేరుతో ప్రజలను ఇబ్బందులపాలు చేయడంపై మండిపడింది. మన రైతులు ఉండగా, విదేశీ రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఏంటని పాకిస్థాన్ పేర్కొనడంపై డాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ మంత్రిగారి తలపై ఓ ట్రక్కు టమోటాలను కుమ్మరిస్తే కానీ విషయం అర్థమయేలా లేదని కథనం పేర్కొంది. భారత్ తో పోరాడుతున్నాం కనుక అక్కడి నుంచి టమోటాలను దిగుమతి చేసుకోమని పేర్కొంటూ దేశంలోని పౌరుల కడుపు కాల్చడం ఎంతవరకూ సబబని ఆ కథనం నిలదీసింది. లాహోర్ లో కేజీ టమోటా 300 రూపాయలు పలుకుతుండగా, అక్కడికి కేవలం 30 మైళ్ల దూరంలోని అమృతసర్ లో కేజీ టమోటా కేవలం 40 రూపాయలకే దొరుకుతున్నాయంటూ వ్యత్యాసాన్ని ఎత్తి చూపింది. ప్రజా ప్రతినిధులు నిత్యావసరాలు దిగుమతి చేసుకుని ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఆ కథనం హితవు పలికింది.