mohan kumar mangalam hospital: ఆదర్శంగా నిలిచిన సేలం కలెక్టర్.. అస్వస్థతకు గురైన కుమారుడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన వైనం!
- ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంచిన కలెక్టర్
- ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి ప్రశంసలు
- కుమారుడికి డెంగీ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్న రోహిణి
చిన్నపాటి జ్వరమొస్తే ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ పరుగులుపెట్టే వేళ తమిళనాడులోని సేలం జిల్లా కలెక్టర్ రోహిణి తన కుమారుడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి సర్కారు దవాఖానాలపై నమ్మకాన్ని పెంచారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడిని రోహిణి వెంటనే సేలంలోని మోహన్ కుమార మంగళం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. డెంగీ అనుమానంతో రక్త పరీక్షలు చేయించారు. గత కొంతకాలంగా సేలం పట్టణాన్ని డెంగీ వణికిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన కుమారుడికి డెంగీ పరీక్షలు చేయించారు.
కలెక్టర్ తన కుమారుడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన వార్త హల్‌చల్ చేసింది. దీంతో ఆమెను ప్రజలు, ప్రజాప్రతినిధులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. కలెక్టర్ చర్యతో ప్రభుత్వ ఆసుపత్రులపై తమకు నమ్మకం పెరిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరీక్షల్లో తన కుమారుడికి డెంగీ లేదని తేలడంతో రోహిణి ఊపిరి పీల్చుకున్నారు.