america: మీ ఇష్టం! ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటారా?.. మమ్మల్ని రంగంలోకి దిగమంటారా?: పాక్‌కు తేల్చిచెప్పిన అమెరికా
- పాకిస్థాన్‌కు అమెరికా డైరెక్ట్ వార్నింగ్
- తమతో కలిసి వస్తారో లేదో తేల్చుకోవాలని సూచన
- ఉగ్రవాదులను ఎలా ఏరివేయాలో తమకు తెలుసన్న యూఎస్
పాకిస్థాన్‌పై అమెరికా మరోమారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసారి నేరుగా వార్నింగ్ ఇచ్చింది. తమ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులను, సంస్థలను ఏరిపారేయాలని ఆదేశించింది. లేదంటే తామే తమ స్టైల్లో రంగంలోకి దిగాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంలో తేల్చుకోవాల్సింది మీరేనంటూ తేల్చిచెప్పింది.
ఇస్లామాబాద్‌లో అడుగుపెట్టిన అమెరికా విదేశాంగమంత్రి రెక్స్ టిల్లర్సన్ మాట్లాడుతూ పాకిస్థాన్‌కు అమెరికా మద్దతు ఉంటుందంటూనే ‘కండిషన్స్ అప్లై’ అని పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఏం చేయాలో తమకు తెలుసని, అందుకు తగిన మార్గాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. తమతో కలిసి పనిచేసేదీ, లేనిదీ తేల్చుకోవాల్సింది పాకిస్థానేనని దక్షిణాసియా తాత్కాలిక సహాయ కార్యదర్శి అలీస్ వెల్స్ పేర్కొన్నారు. తమతో కలిసి పనిచేసే ఉద్దేశం పాకిస్థాన్‌కు లేకపోతే కనుక, అప్పుడు తామేం చేయాలో అది చేస్తామని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదుల వెనక భారత్, అమెరికా ఉందన్న పాక్ వ్యాఖ్యలను అలీస్ కొట్టిపడేశారు. ఆఫ్ఘనిస్థాన్, ఇండియాల్లో విధ్వంసం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు సహకరించడం మాని తమ నిజాయతీని పాక్ నిరూపించుకోవాల్సి ఉందన్నారు.