Himachalpradesh: చనిపోయాడనుకుని కర్మకాండలు నిర్వహిస్తే.. 12 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు!

  • 12 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిన బాలుడు
  • 12 ఏళ్ల తర్వాత యువకుడిగా తిరిగి కుటుంబ సభ్యుల చెంతకు
  • చూసేందుకు  పోటెత్తుతున్న గ్రామస్తులు

పన్నెండో ఏట మాయమైన కుమారుడు పన్నెండేళ్ల తర్వాత సొంత ఇంటికి చేరిన కథ ఇది. ఇప్పుడతడిని చూసేందుకు గ్రామస్తులు క్యూకడుతున్నారు. ఇన్నాళ్లూ ఎక్కడున్నావ్? ఏం చేశావ్? ఇంటి నుంచి ఎందుకెళ్లావ్? అంటూ ఆశ్చర్యంతో ప్రశ్నలు గుప్పిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని పిపర్ కల్యాణ్ గ్రామంలో జరిగిందీ ఘటన.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గులాబ్‌దాస్‌కు నలుగురు కుమారులు. ఉపేంద్ర అందరికంటే చిన్నవాడు. 12వ ఏట ఉపేంద్ర అదృశ్యమయ్యాడు. గులాబ్ దాస్ కుమారుల్లో పెద్దవాడైన మోహన్‌లాల్ పంజాబ్‌లో, రెండోవాడైన శైలేష్ అత్తవారింట్లో ఉంటుండగా మూడోవాడు రాజేంద్ర ఇంటి వద్దే ఉంటూ పొలం వ్యవహారాలు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు మృతి చెందారు.


ఇంటి నుంచి మాయమైన ఉపేంద్ర చిన్నప్పటి నుంచి మానసిక వ్యాధితో బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతడిని వెతికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి ఉపేంద్ర చనిపోయి ఉంటాడని భావించి తొమ్మిదేళ్ల క్రితం కర్మకాండలు నిర్వహించారు.

తాజాగా ఉపేంద్ర సొంతూరికి చేరుకుని కుటుంబ సభ్యులను కలవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అతడిని చూసేందుకు గ్రామస్తులు తరలివస్తున్నారు. కుశల ప్రశ్నలతో ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ తాను సిమ్లా వెళ్లి అక్కడే ఓ చోట పనిచేస్తున్నట్టు చెప్పాడు. ఇన్నాళ్లూ అక్కడే ఉన్నానని, ఇటీవల పోలీసులు తన వివరాలు కనుక్కుని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చినట్టు చెప్పాడు. కాగా, మాయమైన సోదరుడిని తిరిగి తీసుకొచ్చి అప్పజెప్పిన పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News