big b: అక్రమ నిర్మాణాల నోటీసుపై స్పందించిన బిగ్‌బీ!
- నోటీసులు జారీ చేసిన ముంబై మున్సిపల్ కార్పోరేషన్
- స్టేట్‌మెంట్ విడుదల చేసిన అమితాబ్ తరఫు లాయర్లు
- తాను అక్రమ నిర్మాణాలు చేయలేదని వ్యాఖ్య
ముంబైలోని గోరేగావ్, ఫిల్మ్‌సిటీ ప్రాంతంలోని తన బంగళాలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసును ఖండిస్తూ బిగ్‌బీ ఓ లీగల్ స్టేట్‌మెంట్ విడుదల చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లుగా బీఎంసీ ఆరోపిస్తున్న స్థలంలో తమ క్లెయింట్ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదని అమితాబ్ తరఫు న్యాయవాదులు స్టేట్‌మెంట్లో పేర్కొన్నారు.
`ఒబెరాయ్ సెవెన్‌లో ఆస్తులను 2012 అక్టోబర్ 29న ఒబెరాయ్ రియల్టీ లిమిటెడ్ నుంచి మా క్లెయింట్ (అమితాబ్) కొన్నాడు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ 2012 నవంబర్ 2న సబ్‌రిజిస్ట్రార్ ముందు జరిగింది. ఆ స్థలంలో మా క్లెయింట్ ఒక ఇటుక కూడా వేయలేదు... ఒక ఇటుక తీయలేదు. కాబట్టి అక్రమ నిర్మాణాలు అనే అంశం ప్రస్తావనే లేదు` అని స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. కాగా బిగ్‌బీతో పాటు నోటీసులు అందుకున్న రాజ్‌కుమార్ హిరానీ, పంకజ్ బాలాజీ, హరేష్ ఖండేల్‌వాల్, హారిస్ జగిత్యానిలు మాత్రం ఇంకా ఏం స్పందించలేదు.