Modi: తప్పుడు వాణిజ్య ప్రకటనలపై ఇక ఉక్కుపాదం.. రూ.50 లక్షల జరిమానా!: వచ్చేస్తున్న కొత్త చట్టం
- మూడేళ్లుగా చట్టానికి రూపకల్పన
- ఈ శీతాకాల సమావేశాల్లో కేబినెట్ ముందుకు
- తప్పుడు ప్రకటనదారులకు ఇక జైలే
'ఈ పిల్ వేసుకోండి.. మీ బరువును అమాంతం తగ్గించుకోండి'.. 'ఈ క్రీమ్ రాసుకోండి, ఇన్ని వారాల్లో మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోండి'.. నిత్యం మనకు టీవీల్లో కనిపించే ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇకపై కనిపించవు. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ఇటువంటి ప్రకటనలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించినట్టు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఇందుకు సంబంధించిన చట్టం కేబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.
సెలబ్రిటీలతో ప్రకటనల్లో నటింపజేసి వినియోగదారులను తప్పుదోవ పట్టించే సంస్థలపై రూ.50 లక్షల జరిమానాతోపాటు వాటిపై మూడేళ్ల నిషేధం విధించనున్నారు. అంతేకాదు జైలు శిక్ష కూడా విధించనున్నారు.
అంతర్జాతీయ కన్జూమర్ ప్రొటెక్షన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. మూడేళ్లుగా రూపకల్పన చేస్తున్న ఈ చట్టాన్ని శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రధాని తెలిపారు. వినియోగదారుల సాధికారతకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మోసపోయిన వినియోగదారులకు త్వరితగతిన పరిహారం అందించేందుకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వినియోదారుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రధాని స్పష్టం చేశారు.