gurkha land: మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోరాటం చేయమంటూ నిధులిచ్చిన నేత అరెస్టు
- సుదీర్ఘకాలం కొనసాగిన గూర్ఖాల్యాండ్ ఉద్యమం
- మమతాబెనర్జీకి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలంటూ డబ్బులిచ్చిన గూర్ఖా జనముక్తి మోర్చా ఢిల్లీ విభాగాధిపతి మనోజ్ శంకర్
- ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఎన్ క్లేవ్ నుంచి మనోజ్ శంకర్ అరెస్టు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు నిధులిచ్చిన గూర్ఖా జనముక్తి మోర్చా ఢిల్లీ విభాగాధిపతి మనోజ్ శంకర్ ను కోల్ కతాలో పోలీసులు అరెస్టు చేశారు. దాని వివరాల్లోకి వెళ్తే, గూర్ఖాల్యాండ్ ఉద్యమం సుదీర్ఘ కాలం కొనసాగిన సంగతి తెలిసిందే. నెలలపాటు సాగిన ఈ ఉద్యమంలో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఈ ఉద్యమ నేతల ఇళ్లపై జరిగిన దాడుల్లో పలు మారణాయుధాలు, భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అప్పట్లో వార్తలు కూడా వెలువడ్డాయి.
ఎగసిపడిన గూర్ఖాల్యాండ్ ఉద్యమం సుదీర్ఘ కాలం కొనసాగడానికి గల కారణాలపై సీఐడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని చెబుతూ ఉద్యమకారులకు మనోజ్ శంకర్ డబ్బులిచ్చినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ డబ్బుతో గూర్ఖా ల్యాండ్ ఉద్యమకారులు తుపాకులు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో సీఐడీ అధికారులు నిర్థారించుకున్నారు. దీంతో మనోజ్ శంకర్ పై సీఐడీ అధికారులు 13 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఎంక్లేవ్ లో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు కోల్ కతా సీఐడీ అదనపు డైరెక్టరు జనరల్ రాజేష్ కుమార్ వెల్లడించారు.