russia: సైబర్ ప్రపంచంలోకి కొత్త మాల్వేర్... రష్యా, ఉక్రెయిన్ దేశాల సంస్థలపై దాడి చేసిన `బ్యాడ్ ర్యాబిట్`
- హెచ్చరిక జారీ చేసిన అమెరికా ప్రభుత్వం
- న్యూస్ ఏజెన్సీ, విమానాశ్రయం సర్వర్లపై దాడి చేసిన మాల్వేర్
- చాలా త్వరగా వ్యాపిస్తున్న `బ్యాడ్ ర్యాబిట్`
అంతర్జాతీయ సైబర్ ప్రపంచాన్ని మరో మాల్వేర్ వణికిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల్లోని న్యూస్ ఏజెన్సీలు, విమానాశ్రయాలపై దాడి చేసిన ఈ మాల్వేర్ని `బ్యాడ్ ర్యాబిట్` అని పిలుస్తున్నారు. రష్యాలోని ఇంటర్ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ, ఉక్రెయిన్‌లోని ఒడెస్సా విమానాశ్రయ సర్వర్లు ఈ మాల్వేర్ బారిన పడ్డాయి.
సర్వర్ నుంచి సర్వర్‌కు ఇది చాలా త్వరగా వ్యాపిస్తున్న కారణంగా అమెరికా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. మే నెలలో వచ్చిన `వాన్నా క్రై` ర్యాన్సమ్వేర్, జూన్‌లో వచ్చిన `నాట్‌పెట్యా` వైరస్ల మాదిరిగా ఇది కూడా తీవ్రనష్టాన్ని కలిగించే అవకాశం ఉందని పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్లతో పాటు బల్గేరియా, టర్కీ, జపాన్ దేశాల్లోని కొన్ని సర్వర్లకు కూడా ఈ మాల్వేర్ వ్యాపించినట్లు తెలుస్తోంది.
ఈ వైరస్ సిస్టంలోకి ప్రవేశించి ముఖ్యమైన ఫైళ్లను లాక్ చేస్తుంది. వాటి లాక్‌ను ఓపెన్ చేయడానికి డబ్బు చెల్లించాలని అడుగుతుంది. దీని వల్ల స్టాక్ మార్కెట్లు, విమానాశ్రయాల్లో పనులు మందగిస్తాయి. అయితే వాన్నా క్రై, నాట్‌పెట్యా, బ్యాడ్ ర్యాబిట్ ఈ మూడు మాల్వేర్లకు ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో రష్యాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కీ విచారిస్తోంది.