gujarat: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌.. డిసెంబర్ 9, 14 తేదీల్లో పోలింగ్

  • షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల ప్రధాన అధికారి అచల్‌ కుమార్‌ జోతి
  • మొదటి దశలో 89, రెండో దశలో 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
  • డిసెంబర్‌ 18న ఓట్ల లెక్కింపు
  • ఎన్నికల కోడ్ నేటి నుంచే అమల్లోకి

ఈ ఏడాది డిసెంబర్ 9, 14 తేదీల్లో గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి అచల్‌ కుమార్‌ జోతి వెల్లడించారు. ఈ రోజు నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో గుజ‌రాత్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ఆయ‌న విడుద‌ల చేశారు. మొదటి దశలో 89, రెండో దశలో 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుందని పేర్కొన్నారు. డిసెంబర్‌ 18న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. గుజ‌రాత్ లో జ‌రగ‌నున్న‌ ఎన్నిక‌ల్లో వీవీపాట్ వినియోగిస్తామ‌ని చెప్పారు.

అలాగే ఎన్నికల కోడ్ ను నేటి నుంచే అమల్లోకి తీసుకొస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ. 28 లక్షలకు మించి ఖర్చు చేయరాదని, అలాగే ఆయా అభ్యర్థులు కొత్త బ్యాంకు ఖాతాలు తెరిచి, ఎన్నికల ఖర్చును చూపించాలని ఆయ‌న తెలిపారు. ఎవ‌రయినా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే తాము ప్ర‌త్యేకంగా రూపొందించిన ఈసీ మొబైల్ యాప్ ద్వారా ఎన్నికల అధికారులకు ప్ర‌జ‌లు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

కాగా, వ‌చ్చే ఏడాది జనవరి 22న‌ గుజరాత్ అసెంబ్లీ కాలం ముగుస్తుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 4.33 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నారు. ఈ సారి ఎన్నికల కోసం 50,128 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

gujarat
elections
dates
  • Error fetching data: Network response was not ok

More Telugu News