Philippines: మూడేళ్ల పాటు కొబ్బరి చెట్టే అతని నివాసం... తల్లి, పిల్లలు కోరినా కిందకు దిగలేదు!

  • తుపాకీతో తలపై కొట్టడంతో మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి
  • మూడేళ్లుగా 60 అడుగుల ఎత్తైన కొబ్బరి చెట్టుపైనే జీవనం
  • కిందికి దిగితే చంపేస్తారని వాదన..సోషల్ మీడియాలో వైరల్

జీవితంలో ఎదురైన సంఘటనలు మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయన్న సంగతి తెలిసిందే. 2014లో ఫిలిప్పీన్స్ లోని అగుసాన్ డెల్ ప్రావిన్స్ ప్రాంతంలోని లాపెజ్ లో చిన్న ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అదే ప్రాంతానికి చెందిన గిల్బెర్ట్ సాంచెజ్ (47) తలపై తుపాకీతో కొట్టారు. తీవ్రభయాందోళనలకు గురైన గిల్బెర్ట్ మతిస్థిమితం కోల్పోయాడు. దీంతో తన ఇంటి సమీపంలోని 60 అడుగుల చెట్టు ఎక్కాడు. మరి కిందికి దిగలేదు. వయసుమళ్లిన తన తల్లి సహా, కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు.

 కిందికి దిగమన్న కుటుంబ సభ్యులతో దిగితే తనను చంపేస్తారంటూ వాదించడం మొదలుపెట్టాడు. దీంతో వారు మౌనం వహించి, అతనికి ఆహారం, సిగరెట్లు, దుస్తులు చెట్టుపైకి అందించేవారు. ఇలా సుమారు మూడేళ్లకుపైగా అతను ఆ కొబ్బరి చెట్టుపైనే ఉండిపోయాడు. దీంతో అతనికి పలు చర్మవ్యాధులు సోకాయి. అతని శరీరం నుంచి దుర్వాసన వచ్చేది. అయినప్పటికీ ఆయన కిందికి దిగలేదు. స్థానికులకు ఈ విషయం తెలిసినా వారు పెద్దగా పట్టించుకోలేదు. సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో అతనికి సంబంధించిన కథనంతో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు.

అతను కిందికి రాకపోవడంతో అతనిపై ఆధారపడిన కుటుంబం ఎంత చితికిపోయింది వివరించాడు. అతని కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందని, అతని ఇద్దరు కుమార్తెలు చదువు మానేశారని చెబుతూ వివరంగా ఆయన సోషల్ మీడియాలో కథనం రాశారు. అది వైరల్ గా మారింది. దీంతో మీడియా వేగంగా స్పందించింది. అందులో వాస్తవమెంతో తెలుసుకునేందుకు అతని ఇంటికి వెళ్లింది. వాస్తవమని నిర్ధారించుకుని మీడియాలో అతని కథనం ప్రసారం చేసింది.

దీంతో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం స్పందించింది. ప్రత్యేక రెస్క్యూ టీమ్ ను ఏర్పాటు చేసింది. 50 మందితో కూడిన ఆ రెస్క్యూ టీమ్ ఇటీవల గిల్బెర్ట్ ను కిందికి దించారు. అనంతరం అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను కండరాల క్షీణత, వెన్నెముక సంబంధ సమస్యలతో బాధపడుతున్నాడు. సోషల్ మీడియాలో ఇది విస్తృతంగా ప్రచారం కావడంతో అతని కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News