hardh: గుజరాత్ లో ఓడిపోనున్న బీజేపీ: హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు

  • గెలిచేది కాంగ్రెస్ పార్టీయే
  • మా మద్దతు కావాలంటే డిమాండ్లు తీర్చండి
  • రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే.. అధిక అసెంబ్లీ సీట్లూ ఇవ్వాలి 
  • హార్దిక్ పటేల్ డిమాండ్లు

డిసెంబర్ లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీకి తీవ్ర పరాభవం ఎదురు కానుందని పటేల్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ మాత్రమేనని చెబుతూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుపు అంత సులభమేమే కాదని ఆయన అన్నాడు. కాంగ్రెస్ కు తాను మద్దతు పలకాలంటే కొన్ని డిమాండ్లను నెరవేర్చాలని ఆయన కోరినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఉద్యోగ, విద్యా సంస్థల్లో పటీదార్లకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లో తాను సూచించిన వారికి టికెట్లు ఇవ్వాలని కోరినట్టు సమాచారం.

కాగా, ఇంకా 25 సంవత్సరాలు నిండని హార్దిక్ పటేల్, ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీలోకి దిగే అవకాశాలు లేవన్న సంగతి తెలిసిందే. సోమవారం నాడు ఆయన గుజరాత్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ అశోక్ గెహ్లాట్ ను కలిసిన వేళ, అదే హోటల్ లో ఉన్న రాహుల్ గాంధీని కూడా ఆయన కలిశారని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. వీటిని హార్దిక్ స్వయంగా ఖండించారు. తాను రాహుల్ ను కలిస్తే, అది నలుగురి ముందూ బహిరంగంగానే ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక గుజరాత్ కాంగ్రెస్ క్యాడర్ లో పటేల్ సామాజిక వర్గం తక్కువగానే ఉండటంతో, హార్దిక్ చేరికతో మరింత బలోపేతం కావచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.

ఇదిలావుండగా, హార్దిక్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ, ఆయనతో సమావేశం చాలా బాగా సాగిందని గెహ్లాట్ గత రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. హార్దిక్ కు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న సంకేతాలను గెహ్లాట్ ట్వీట్ ద్వారా వెల్లడించారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, బీజేపీ మాత్రం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. కాంగ్రెస్, హార్దిక్ లు ఇప్పటికే కలిసిపోయారని, ఇప్పుడు జరుగుతున్నది అంతా డ్రామాయేనని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News