Dead festival: మెక్సికోలో ఓవైపు దెయ్యాలు.. మరో వైపు అస్థిపంజరాలు.. ఉత్సాహంగా డెత్ ఫెస్టివల్!
- ఉత్సాహంగా సాగుతున్న ‘డెత్ ఫెస్టివల్’
- దెయ్యాలు, అస్థిపంజరాల వేషధారణలో భయపెడుతున్న ప్రజలు
- చనిపోయిన తమవారి ఆత్మలు భూమికి వచ్చి తమతో కలుస్తాయని నమ్మకం
మెక్సికోలో డెత్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతోంది. చనిపోయిన తమవారిని స్మరించుకునేందుకు నిర్వహించే ఈ పండుగలో దెయ్యాలు, భూతాల వస్త్రధారణతో భయపెట్టారు. అస్థిపంజరాలు, దెయ్యాలు, రాక్షసుల వేషధారణలో ప్రజలు సందడి చేశారు. దాదాపు 200 మంది చిత్రకారులు వందలాదిమందిని ఇలా తీర్చిదిద్దారు. వారం రోజులపాటు ఈ వేడుక సాగనుంది. ఈ పండుగను చూసేందుకు వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
చనిపోయిన ఆత్మీయులను స్మరించుకునే ఈ పండుగ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. కాలక్రమంలో అది సాంస్కృతిక ఉత్సవంగా మారింది. అసలైన పండుగ అక్టోబరు 31న ప్రారంభమై నవంబరు 2న ముగుస్తుంది. ఈ రోజుల్లో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని, భూమిపై ఉన్న తమ వారిని కలుసుకునేందుకు ఆత్మలకు అనుమతి లభిస్తుందని చెబుతారు.
అక్టోబరు 31న చనిపోయిన చిన్నారులు భూమికి వస్తారని విశ్వసిస్తారు. నవంబరు 1న ‘ఆల్ సెయింట్స్ డే’ను నిర్వహిస్తారు. ఆ రోజున చనిపోయిన పెద్దలు స్వర్గం నుంచి వచ్చి తమతోపాటు ఒకరోజంతా గడుపుతారని చెబుతారు. ఇక నవంబరు 2న ఉత్సవం ముగుస్తుంది. ఆ రోజున శ్మశానాన్ని సందర్శించి తమవారి సమాధులను శుభ్రం చేసి అలంకరిస్తారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు.