team India: ఇప్పటికీ ధోనీనే మా కెప్టెన్.. కోహ్లీ కాదు: టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్
- మాకు సలహాలు ఇచ్చేది ధోనీనే..
- ధోనీ చెప్పినట్టు బౌలింగ్ చేస్తే వికెట్లు పడగొట్టడం ఈజీ
- మహీ లాంటి అనుభవజ్ఞుడితో ఆడడం ఆనందంగా ఉందన్న కొత్త కుర్రాడు
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా తమ కెప్టెన్ ఇప్పటికీ మహేంద్రసింగ్ ధోనీయే అంటూ టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ కితాబిచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో కోహ్లీ తమకు ఎక్కడో దూరంగా ఉంటాడని, ఆ సమయంలో తమను గైడ్ చేసేది ధోనీయేనని చెప్పుకొచ్చాడు. తమకొచ్చిన సందేహాలను, ఫీల్డింగ్‌లో ఎదురయ్యే ఇబ్బందులు, మార్పు చేర్పులు, ఎక్కడ ఎవరు ఉండాలి.. అన్న విషయాలను ధోనీతో పంచుకుంటామని తెలిపాడు.
ధోనీ నుంచి తమకు పూర్తి సహకారం అందుతోందని, ఈ విషయంలో కోహ్లీకి ధోనీ పూర్తిగా అభయం ఇస్తున్నాడని పేర్కొన్నాడు. ‘‘నువ్వు అక్కడ ఉండు.. ఇక్కడ నేను చూసుకుంటా’’ అని కోహ్లీతో చెబుతుంటాడని చాహల్ తెలిపాడు. ధోనీలాంటి సీనియర్ ఆటగాడితో ఆడడం చాలా ఆనందంగా ఉందన్న చాహల్.. ధోనీ తనను చోటీ అని పిలుస్తుంటాడని మురిసిపోయాడు. బ్యాట్స్‌మెన్ మైండ్‌సెట్‌ను చదవడంలో దిట్ట అయిన ధోనీ చెప్పినట్టు బౌలింగ్ చేయడం వల్ల వికెట్లు దక్కించుకోవడం సులభం అవుతుందని చాహల్ పేర్కొన్నాడు.