hardik patel: గజదొంగను ఓడించేందుకు దొంగకు మద్దతిస్తే తప్పేంటి?: బీజేపీపై హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు
- నేనేమీ దొంగ చాటుగా వెళ్లి పాకిస్ధాన్ ప్రధానిని కలవలేదు
- భారతీయుడైన రాహుల్ గాంధీని మాత్రమే కలిశాను
- గుజరాత్ లో ప్రతీది తమ ఆస్తి అన్నట్టు బీజేపీ భావిస్తోంది
'గజదొంగ' (బీజేపీ) ను ఓడించేందుకు 'దొంగ' (కాంగ్రెస్) కు మద్దతిస్తే తప్పేంటని పటీదార్ అనామత్ ఆందోళన్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ ప్రశ్నించారు. అహ్మదాబాద్ లో రాహుల్ గాంధీని కలవడంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన సమాధానమిస్తూ, రాహుల్ ఉన్న హోటల్ కు వెళ్లానని, అయితే ఆయనను కలవలేదని స్పష్టం చేశారు. సమయాభావంతో అశోక్ గెహ్లాట్ తో సమావేశమయ్యానని ఆయన అన్నారు.
ఉత్తర గుజరాత్ లో రోడ్ షో, బహిరంగ సభల కారణంగా రాహుల్ గాంధీ సమావేశానికి వెళ్లలేకపోయానని ఆయన తెలిపారు. గుజరాత్ లో ఉన్న ప్రతీది తమ ఆస్తి అన్నట్టు బీజేపీ నేతలు భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తానేమీ దొంగచాటుగా వెళ్లి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలవలేదని, భారతీయుడైన రాహుల్ గాంధీని మాత్రమే కలిశానని ఆయన ఎద్దేవా చేశారు.