An Egg Stall: బ్రెడ్ ఆమ్లెట్ అమ్మేవాడితో గొడవ పెట్టుకున్న యువకుడి హత్య!
- బ్రెడ్ ఆమ్లెట్ తినడానికి వెళ్లి షాపు యజమానితో గొడవ
- తన వద్ద పని చేసే వ్యక్తులతో కలిసి ఆ యువకుడిని కత్తితో పొడిచిన షాప్ యజమాని
- నాలుగు రూపాయల కోడిగుడ్డు విషయంలో చెలరేగిన గొడవ
బ్రెడ్ ఆమ్లెట్ తినడానికి వెళ్లిన ఓ యువకుడికి, ఆ షాపు యజమానికి మధ్య నాలుగు రూపాయల కోడిగుడ్డు విషయంలో గొడవ చెలరేగింది. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న షాపు యజమాని తన వద్ద పని చేసే వ్యక్తులతో కలిసి ఆ యువకుడిని కత్తితో పొడిచి చంపేశాడు. చిన్న విషయానికే హత్య జరగడం ముంబయికి సమీపంలోని నాలా సోపారాలో అలజడి సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే, రవి భగవత్ అనే నలభై ఏళ్ల వ్యక్తి అర్ధరాత్రి పూట ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు తన స్నేహితుడితో కలిసి వెళ్లి, బ్రెడ్ ఆమ్లెట్ కావాలని చెప్పాడు.
అయితే, ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో.. నాలుగు రూపాయల కోడిగుడ్డు కోసం ఆ యువకుడు షాపు యజమానితో గొడవ పెట్టుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ షాపు యజమాని, తన వద్ద పనిచేసే వారితో కలిసి భగవత్‌ను కత్తితో పొడిచారు. దీంతో భగవత్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అలాగే మొదట హత్యకేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు.